
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 : మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క(స్వీట్‌కార్న్) పేలాల మక, బేబీకార్న్ వంటి అధిక ప్రొటీన్లు ఉండే రకాలను సాగు చేస్తే లాభాలు గడించవచ్చు. ఈ నేపథ్యంలో స్వీట్‌కార్న్ పండించే పద్ధతులను పలువురు శాస్త్రవేత్తలు వివరించారు.
ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు..
తీపి మక్క తక్కువ కాలంలో కోతకు రావడమే కాకుండా, నేరుగా తినే పదార్థంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్వీట్‌కార్న్ ఒక్కో కంకిని రూ.20 చొప్పున భువనగిరితోపాటు యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు తదితర పట్టణాల్లో రోడ్ల వెంట ఉడకబెట్టి విక్రయిస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు. పంటకాలం కేవలం 75 నుంచి 80 రోజులు, కంకి దశలోనే విరవడంతో పచ్చిమేతగా కూడా ఉపయోగపడుతుంది. పచ్చిమేతను డెయిరీ ఫారాలకూ అమ్ముకోవచ్చు. మార్కెట్ డిమాండ్ మేరకు రైతులకు ఒక్కో కంకికి రూ.8 నుంచి రూ.9 వరకు ధర వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ మక్క కంటే తీపి మక్కలో 2 నుంచి 3 రెట్లు అధిక చక్కెర పదార్థాలు, పోషకాలు, ఖనిజ లవణాలు ఉంటాయి. గింజ నిండిన తర్వాత గింజ గట్టి పడకముందే కోత కోయాలి. ఎకరాకు దాదాపు 33వేల పచ్చి కంకుల దిగుబడి వస్తుంది.
దశలవారీగా విత్తుకోవాలి..
ఈ పంటకు 19 నుంచి 32డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. అధిక ఉష్ణోగ్రత, మంచు, చలికి తట్టుకోదు. మురుగునీరు పోయే వసతి ఉన్న ఎర్ర గరప, మధ్యరకపు, రేగడి నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు, చవుడు నేలలు పనికి రావు. ఎకరానికి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. సాధారణ రకాలతో పోలిస్తే స్వీట్‌కార్న్ విత్తనాల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విత్తిన మరుసటి రోజు నీరు పెట్టాలి. తర్వాత మరో 4-5 రోజులకు నీరందించాలి. దీంతో మొలకశాతం పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఎద్దడి రాకుండా వారం రోజులకో తడి ఇచ్చేలా చూసుకోవాలి. కొంత భూమిలో విత్తనం వేసిన తర్వాత మరికొంత భూమిలో మరో 10 రోజులకు విత్తుకోవాలి. దీంతో స్వీట్‌కార్న్ కంకులు ఒకేసారి కోతకు రాకుండా, వివిధ రోజుల్లో రావడంతో మార్కెటింగ్ చేయడం సులభమవుతుంది.
ఎరువుల యాజమాన్యం కీలకం..
ఎకరాకు నత్రజని 60-72 కిలోలు, భాస్వరం 24 కిలోలు సరిపోతుంది. మొత్తం భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను పంట విత్తే సమయంలో వేయాలి. నత్రజనిని మూడు దఫాలుగా సమానంగా.. విత్తేటప్పుడు ఓసారి, 30-35 రోజులకు రెండో సారి, పూతదశలో మూడోసారి వేయాలి. భూమిలో జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. కలుపు నివారణకు విత్తిన 1-2 రోజుల్లో ఎకరాకు ఒక కిలో అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 25-30 రోజుల అనంతరం అంతర కృషి చేసి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
చీడపీడల నివారణ
తీపి మక్కను కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. ఇవి ఆకులపై గుండ్రటి చిల్లులు చేసి, కాండంలో ‘ఎస్’ ఆకారంలో సొరంగాలు చేస్తాయి. తర్వాత మొవ్వ చనిపోతుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కోరాజిన్ 0.3 మి.లీ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా పంటల్లో క్రిమిసంహారక మందులు వాడేటప్పుడు ఒక్కటికి రెండుసార్లు సమీప వ్యవసాయాధికారులు లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి వాడితే మంచిది.