
సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల నమోదు
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
పంటల లెక్కల ఆధారంగా దిగుబడుల అంచనా.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు
పర్యవేక్షిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారులు
రోజువారీగా ఆన్లైన్లో నమోదు
వానకాలం సాగు వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తున్నది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఆ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్లు, రైతుల వారీగా పక్కా వివరాలు సేకరిస్తున్నారు. ఏ గుంటలో ఏ పంట వేశారో.. ఏ గ్రామంలో ఏ ఏ పంటలు ఎంతమేర వేశారు.. తదితర పంటల వివరాలు సేకరిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వానకాలం పంటల సాగు జోరుమీద ఉన్నది. అయితే వరి తరువాత అధిక శాతం రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తుండగా, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో రెండురోజులుగా ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగా.. రోజూవారీగా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. సాగు వివరాల ఆధారంగానే రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. పంట దిగుబడులు అంచనా వేసి, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయనున్నది. అందుకే వ్యవసాయశాఖ పక్కాగా వివరాలు సేకరిస్తున్నది.
పొలం బాట పట్టిన ఏఈఓలు
ఆన్లైన్లో వివరాల నమోదు
సర్వే ప్రారంభించిన అధికారులు
సెప్టెంబర్ 5వ తేదీ వరకు గడువు
జిల్లాలో పంటల సాగు ఇలా
జిల్లాలో వనరులు, నేలల భూసారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సర్వేను పక్కాగా చేసేలా వ్యవసాయ అధికారులను సన్నద్ధం చేసింది. ప్రస్తుతం ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నంబర్ ప్రకారం నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వానకాలం పంటల సాగు జోరుమీద ఉన్నది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 4.42 లక్షల ఎకరాలుగా జిల్లా వ్యవసాయశాఖ అంచనాలు వేయగా, ఇప్పటికే 3.25లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తయింది. అయితే వరి తరువాత అధిక శాతం రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తుండగా, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.95లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా ఉండగా.. ఇప్పటికే 1.20లక్షల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇంకా లక్ష ఎకరాల్లో నాటేందుకు నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈసారి అంచనాలకు మించి వరి సాగవుతుంది. 1.74లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా… ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పత్తి సాగు మొదలైంది. రైతుల్లో వచ్చిన చైతన్య పథకంగా నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ వస్తున్నారు.
ఆలేరు టౌన్/ఆలేరురూరల్, ఆగస్టు 26 : రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు సాగు చేస్తున్నారా? లేదా వేరే పంటలు సాగు చేస్తున్నారా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులు పండించిన పంటల కొనుగోళ్లు సక్రమంగా జరగాలంటే పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. లేదంటే కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇందులో భాగంగా ఖరీఫ్‌లో జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. గ్రామాల వారీగా రైతులు ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాస్తవానికి పంట సాగు చేస్తున్నారా లేదా.. ఇలా అనేక అంశాలతో ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. ఆన్లైన్లో నమోదు చేశాక సాగు విస్తీర్ణం, దిగుబడులు పరిగణలోకి తీసుకొని కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు తదితర వాటిని నిర్ణయించనున్నారు.
ఆలేరు ఏడీవో పరిధిలో ఆలేరు మండలంలో ఏఈవోలు 5 మంది, మోత్కూరు – 4, ఆత్మకూరు (ఎం)- 5, గుండాల – 6, అడ్డగూడూరు – 4 మంది ఏఈవోలు సర్వేలో పాల్గొంటున్నారు. జిల్లాలో వరి 2,04,366, పత్తి 1,91,766, కందులు 46,333, జొన్నలు 2,298 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సర్వే సెప్టెంబర్ 5వ తేదీ లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఆన్లైన్లో నమోదైతేనే కొనుగోళ్లు..
ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేసుకోకుంటే పంట అమ్మే సమయంలో రైతులు ఇబ్బందులు తప్పవు. అన్ని గ్రామాల్లో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల నుంచి పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్లో సంబంధిత ఏఈలు గ్రామాల వారీగా రైతుల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, సెల్ నంబర్లను తీసుకుంటున్నారు. దీంతోపాటు ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో నమోదు చేస్తున్నారు. సదరు వివరాల సమాచారాన్ని రైతుల ఫోన్లకు పంపిస్తున్నారు. ఇందులో ఏమైనా తేడాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారి దగ్గరకు వెళ్లి సరి చూసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పకడ్బందీగా పంటల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఇందుకు గాను ఏఈవోలకు పంటల వివరాల నమోదుకై ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు.
ఎంతో ఉపయుక్తం..
సేకరించిన పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన తరువాత రైతు సెల్ నంబర్‌కు మినీ సమాచారం (ఎస్సెమ్మెస్) పంపిస్తారు. ఎన్ని ఎకరాలు ఉంటే వాటిలో ఏ ఏ పంటలు సాగు చేశారనే సమాచారం సెల్‌ఫోన్‌కు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలవారీగా రైతు పేరు, పట్టాదారు పాస్ పుస్తకం, సర్వే నంబర్ తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలకు అంచనాకు మించి ధాన్యం వచ్చేది. ఈ సారి అక్రమంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం తీసుకువచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, పాలకులు కూర్చున్న చోటనే జిల్లా, మండలం, గ్రామాల వారీగా రైతులు ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో తెలుసుకోవచ్చు.
పకడ్బందీగా చేపడుతున్నారు
రైతులు పండించిన పంటల వివరాలను గ్రామాల వారీగా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పకడ్బందీగా సేకరిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేదు. సేకరించిన వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. సెప్టెంబర్ 5వ తేదీ లోగా సర్వే పూర్తి చేస్తాం.
రైతుల వారీగా సర్వే..
రైతుల సర్వే నంబర్ల ఆధారంగా పంటల సాగు నమోదు ప్రక్రియ చేపడుతున్నాం. గత రెండు రోజుల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో తిరిగి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. రైతులకు పంటల దిగుబడులు వచ్చాక ప్రభుత్వం మద్దతు ధర అందించే అవకాశం కలుగుతుంది. రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవడం వల్ల పంట అమ్మకం సమయంలో సులువుగా ఉంటుంది.