యాదాద్రి, అక్టోబర్19 : దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే దళిత బంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్టకు వచ్చిన మోత్కుపల్లికి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ దళితుల పట్ల బీజేపీ వైఖరేంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ బాటలో దేశం నడువాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి దమ్ముంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకం ఏడాది కిందటే అమలైందని, హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కాదని గుర్తు చేశారు. ఇప్పటికే చాలా మంది దళితుల ఖాతాల్లో రూ.10 లక్షల జమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, వర్గాలకు దళితబంధు తరహాలో పథకాలు రాబోతున్నాయని, కుల రహిత, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కుల వ్యవస్థ, అంటరానితనం పోవాలని పేద ప్రజల కోసం పనిచేస్తున్న కేసీఆర్ వైపు ప్రజలంతా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, ముఖ్యర్ల సతీశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూ నాయక్, అనంతుల జంగారెడ్డి, అంకం నర్సింహ, కీసరి బాలరాజు, ఎరుకల హేమేందర్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ బొట్ల నర్సింహ పాల్గొన్నారు.