Mahesh Babu | సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చేది స్టార్ హీరోలే. ఎందుకంటే వారి ఇమేజ్, ఫ్యాన్ బేస్, మార్కెట్ వల్లే సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తాయి. ఒక స్టార్ హీరో సినిమా విడుదల అంటే అది కేవలం ఒక సినిమా కాకుండా ఒక ఈవెంట్‌లా మారిపోతుంది. అటువంటి స్టార్ హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందువరుసలో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, వరుస విజయాలతో అగ్రహీరోగా ఎదిగాడు. మహేష్ బాబు వ్యక్తిత్వం పరంగా చాలా రిజర్వ్డ్గా ఉంటాడనే పేరు ఉంది. ఎలాంటి వివాదాల్లోనూ ఇరుక్కోకపోవడం, ఎవరిపై కూడా విమర్శలు చేయకపోవడం ఆయన ప్రత్యేకత. సినిమా ఫంక్షన్లకు హాజరైనప్పుడు కూడా చాలా సింపుల్‌గా మాట్లాడి, తన సినిమాకే పరిమితమయ్యే స్వభావం కలిగిన హీరోగా గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నట్లు టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఇటీవల వారణాసి నేపథ్యంలో రూపొందించిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చాలా సింపుల్‌గా హాజరుకావాలని భావించాడట. కానీ రాజమౌళి మాత్రం ఈ ఈవెంట్‌ను ఒక విజువల్ స్పెక్టకిల్‌లా రూపొందించేందుకు ముందుగానే పూర్తి ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు డ్రెస్సింగ్ స్టైల్ నుంచి స్టేజ్ ఎంట్రీ వరకు ప్రతీ అంశాన్ని రాజమౌళి టీమ్ డిజైన్ చేసినట్లు సమాచారం. చివరికి మహేష్ బాబు కూడా ఆ ప్లాన్‌నే అనుసరించాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి సినిమాలంటే కేవలం కథ, టెక్నికల్ విలువలే కాదు, ప్రమోషన్స్ కూడా ఓ ప్రత్యేక బ్రాండ్‌గా మారాయి. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” చిత్రాల సమయంలో ఆయన అమలు చేసిన ప్రమోషనల్ స్ట్రాటజీలు ఎలా పనిచేశాయో తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే ఫార్ములాను మరింత గ్రాండ్‌గా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ వరకు ఇంకా ఎన్నో ఈవెంట్స్, గ్లోబల్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేష్ బాబు కూడా తన కంఫర్ట్ జోన్‌ను దాటి, ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం కొత్తగా మారుతున్నాడని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిస్తే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు పొందగా, ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.