
ఆలేరుటౌన్, ఆగస్టు 19 : రాత పరీక్ష నిర్వహించకుండానే అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జిల్లాలో నూతనంగా మంజూరైన 57 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ టీచర్ల ఎంపికకు కావాల్సిన 100 మార్కులను వివిధ అంశాల వారీగా లెక్కిస్తారు. ప్రధానంగా 10వ తరగతిలో సాధించిన మార్కులను బట్టి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే వితంతువు, చిన్నపిల్లలు ఉంటే, ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో చిన్నపిల్లలకు విద్యాబోధనలో శిక్షణ అర్హత ఉంటే, ప్రభుత్వ అనాథ, ఆశ్రమ పాఠశాలల్లో చదివితే, కార్యకర్త విధులకు ఆటంకం కలుగని రీతిలో పాక్షిక అంగవైకల్యం ఉంటే కూడా మార్కులు కేటాయిస్తారు. అం గన్‌వాడీల ఎంపికకు నియామక కమిటీ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, ఆర్డీవో, డీఎంహెచ్‌వో, సీడీపీవోలు సభ్యులుగా వ్యవహరిస్తారు.
25లోగా దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలో 800 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 57 పోస్టులు ఖాళీగా ఉండగా, నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో అంగన్వాడీ టీచర్లు 8, మినీ అంగన్వాడీ టీచర్లు 4, ఆయాలు 45 ఉన్నాయి. ఈనెల 16 నుంచి 25వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను http://mis. tgwdcw.in లేదా http://wdcw.tg.nic.in ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తు వెంట పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం, కులం, ఎస్ఎస్సీ మెమో, నివాస ధ్రువీకరణ పత్రం, వితంతువైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథ అయితే అనాథ ధ్రువీకరణ పత్రం, వికలాంగులు అయితే సదరం మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను జత చేయాలి. చేసుకున్న వారు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు సంప్రదించాలి. 26 నుంచి 28వ తేదీ వరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలన చేయించుకోవాలి.
అర్హతలు
అభ్యర్థిని తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థినిలు తేదీ 01-07-2021 నాటికి 21- 35 ఏండ్ల వయస్సు మించవద్దు. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఆ ఊరి నివాసురాలై ఉండాలి. రూరల్ ప్రాంతమైనచో అభ్యర్థిని తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. పట్టణ ప్రాంతమైనచో అభ్యర్థిని తప్పనిసరిగా సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినీల్లో 21 ఏండ్లు నిండిన అభ్యర్థినులు లేని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థినిలను పరిగణలోకి తీసుకుంటారు. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు కూడా అంధత్వం ఉన్నప్పటికీ( ఎస్కార్ట్) ఇతరుల సాయం లేకుండా విధులు నిర్వర్తించేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు 3, మినీ అంగన్వాడీ టీచర్ 1, ఆయా పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి.