
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత యువత నైపుణ్యాలకు తగ్గట్టు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. అందుకోసం జిల్లా కేంద్రంలో సిటీ లైవ్లీహుడ్ సెంటర్(సీఎల్సీ) ఏర్పాటుకు మెప్మా సన్నాహాలు చేస్తున్నది. ఈ కేంద్రం ద్వారా నైపుణ్యాభివృద్ధి కలిగిన యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి, జీవన ప్రమాణాలను పెంచేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఈ నెలాఖరులోగా సీఎల్సీని అందుబాటులోకి తీసుకొచ్చి, ఇంటర్, డిగ్రీతోపాటు మొబైల్ సర్వీస్, టైలరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యుటీషియన్, కంప్యూటర్ కోర్సుల వంటివి పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అండగా నిలువనున్నట్లు
తెలిపారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధికి బాటలు వేయాలని సంకల్పించింది. అందులో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో సిటీ లైవ్లీహుడ్ సెంటర్ల(సీఎల్సీ)ను ఏర్పాటు చేసింది. తాజాగా యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణ పేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోనూ ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిరోజుల కిందట సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కొత్తగా సీఎల్సీ కేంద్రం అందుబాటులోకి రానున్నది.
యువతకు మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు…
టెన్త్, ఇంటర్, డిగ్రీతోపాటు ఇతర కోర్సులు పూర్తి చేసి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులు జిల్లాలో ఎందరో ఉన్నారు. మొబైల్ సర్వీస్, టైలరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యుటీషియన్, కంప్యూటర్ సహా డిమాండ్ ఉన్న కోర్సులను సైతం పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సిటీ లైవ్లీహుడ్ సెంటర్ బాసటగా నిలవనున్నది. వివిధ వృత్తుల్లో నైపుణ్యం పొందిన వారు సీఎల్సీ కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకుంటే వారికి ఉపాధి కల్పించే దిశగా మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి అర్హతలను బట్టి సీఎల్సీ కేంద్రం ద్వారా బల్క్ మెస్సేజ్‌లను పంపిస్తారు. సందర్భోచితంగా జాబ్‌మేళాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వివిధ కంపెనీల్లో వారివారి నైపుణ్యతను బట్టి ఉద్యోగవకాశాలు కల్పించే దిశగా సీఎల్సీ కృషిచేస్తుంది.
జిల్లాలో కొనసాగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ…
గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందింపజేసే దిశగా ఇప్పటికే జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 17 మండలాల్లోనూ ఈ తరహా శిక్షణలు కొనసాగుతున్నాయి. చేనేత, పాల ఉత్పత్తి, టైలరింగ్ సహా పలు రంగాల్లో చాలామంది మహిళలు రాణిస్తున్నారు. వీరికి మరింత నైపుణ్యతను కలిగించేందుకు శిక్షణా కేంద్రాల్లో అనుభవజ్ఞులతో తర్ఫీదునిస్తున్నారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్లను సైతం అందజేస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు సైతం పొందేలా చూసి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి రాష్ట్ర యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ కోర్సులతో నామమాత్రపు ఫీజుతో శిక్షణ కార్యక్రమం కొనసాగింది. అయితే ఈ కేంద్రాన్ని ప్రస్తుతం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఏర్పాటు చేశారు. ఐదు రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు సైతం పూర్తవ్వగా..ప్రస్తుతం ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఇక్కడి యువతీ, యువకులకు శిక్షణ ప్రారంభం కానున్నది. ఇదే క్రమంలో జిల్లాలో కొత్తగా సిటీ లైవ్లీహుడ్ సెంటర్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎల్సీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు…
వివిధ వృత్తుల్లో నైపుణ్యం కలిగిన యువతీ యువకులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సీఎల్సీ కేంద్రం ఉపాధి పరంగా ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈనెల 25 లోపు భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ కేంద్రంలో పేర్లను నమోదు చేసుకున్న యువతకు వారి అర్హతలను బట్టి మెప్మా ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. – పూర్ణచందర్, భువనగిరి మున్సిపాలిటీ కమిషనర్, మెప్మా పీడీ