
యాదాద్రి, ఆగస్టు16: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వైష్ణవ ఆగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవఆగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి పూజలు కొనసాగాయి. శివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేషసంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడిని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు.పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,96,956, రూ.100 దర్శ నం ద్వారా రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 5,502, క్యారీబ్యాగుల ద్వారా రూ. 3,300, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 78,000, కల్యాణకట్ట ద్వారా రూ. 31,000, ప్రసాద విక్రయం ద్వారా రూ. 4,96,875, శాశ్వతపూజల ద్వారా రూ. 17,580, వాహనపూజల ద్వారా రూ. 15,300, టోల్గేట్ ద్వారా రూ. 590, అన్నదాన విరాళం ద్వారా రూ. 6,743, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,37,500, యాదరుషి నిలయం ద్వారా రూ. 55,800, పాతగుట్ట ద్వారా రూ. 36,040, కొబ్బరికాయల విక్రయాల ద్వారా రూ.96,000, ఇతర విభాగాలు రూ. 18,080తో కలుపుకుని రూ.13,05,116 ఆదాయం వచ్చిందన్నారు.
శ్రావణమాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల నేపథ్యంలో హోమాలు నిర్వహించేందుకు బాలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు.