
రుణమాఫీ రెండో విడుతకు రైతు కుటుంబాల వివరాలను బ్యాంకులు సిద్ధం చేసి ఉంచాయి. రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలో 16,353 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. రుణమాఫీకి సంబంధించిన రూ.55.34కోట్లను ఈ నెలాఖరు లోగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయను న్నది. రుణమాఫీ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఖాతా లేదా పద్దు కింద జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, అర్హుల జాబితా ఇంకా జిల్లాకు రాకపోవడంతో రెండుమూడు రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చర్యలను ముమ్మరం చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్థిక సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రైతు రుణాలన్నింటినీ నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018 డిసెంబర్ 11వ తేదీ కన్నా ముందు పంటరుణం తీసుకున్న రైతులందరికీ ఈ మాఫీ వర్తించనుంది. గతేడాది మొదటి విడతలో రూ.25వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయగా..తాజాగా రూ.50వేల లోపు రైతులకు రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిధులను సైతం మంజూరు చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను నిర్ధారించుకునేందుకు రేషన్‌కార్డు, ఆధార్‌ను అనుసంధానించి ఆన్లైన్లో పోల్చి చూస్తున్నారు. కుటుంబం మొత్తానికి కలిపి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేయాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి అర్హులైన రైతు కుటుంబాల సేకరణ పూర్తయినప్పటికీ.. సంబంధిత జాబితా ఇంకా జిల్లాకు రాకపోవడంతో రెండు, మూడు రోజుల్లో బ్యాంకర్లు ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. అయితే రుణమాఫీ నిధుల విడుదలకు ఈసారి కొత్త విధానం అమలు చేస్తున్నారు. తొలుత రూ.25వేల నుంచి రూ.26వేల మధ్య బాకీ ఉన్న రైతుల ఖాతాలకు నిధులను జమ చేస్తారు. మరుసటి రోజు రూ.26వేల నుంచి రూ.27వేలు, మూడో రోజు రూ.27వేల నుంచి రూ.28 వేలు ఇలా..రోజుకు రూ.వెయ్యి చొప్పున పెంచుతూ ఈనెల 30 వరకు మొత్తం రూ.50వేల లోపు బాకీలన్నింటికీ నిధులు జమచేస్తారు. రైతు బంధు మాదిరిగానే రుణమాఫీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు పడగానే రుణం మాఫీ అయినట్టు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పేరుతో లబ్ధ్దిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్తుంది. రుణమాఫీ పొందిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని, ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పద్దుల కింద జమ చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి పైనే ఉన్నారు. పంట సీజన్లో సామాన్య రైతులకు పెట్టుబడికి పైసల్లేక సాగును వదిలేసిన వారు ఎందరో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. పంట రుణాల మాఫీ, రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నిరంతర విద్యుత్, సాగునీటి సౌకర్యం వంటి చర్యలతో రైతులు ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ఉత్పత్తి సైతం గణనీయంగా పెరిగింది. మొత్తంగా ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయం పండుగలా సాగుతుండగా..ప్రభుత్వం రుణమాఫీతో బ్యాంకు రుణాల నుంచి విముక్తి కల్పిస్తుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.25వేల లోపు బ్యాంకులో తీసుకున్న వ్యవసాయ రుణాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 10,628 మంది వ్యవసాయ రుణాలను, మరో 378 మంది బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలను తీసుకున్నారు. వీరిలో 7,041 మందిని అర్హులుగా తేల్చి 6,828 మంది ఖాతాల్లో రూ.10.02కోట్లను జమ చేసింది. తాజాగా..50వేల లోపు రుణాలు తీసుకున్న వారివి కూడా మాఫీ చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 16,353 మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. ఇందుకు సంబంధించి రూ.55.34కోట్లను ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమచేయనుంది.