
యాదాద్రి, ఆగస్టు13: వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా జరుగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి తుది మెరుగుల పను లు సకాలంలో పూర్తి చేయాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మొదటగా బాలాలయంలో యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఆయనకు స్వా గతం పలికి, స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పురవీధుల్లో నిర్మితమవుతున్న తుదిదశ లిప్టు, రథశాల, క్యూలైన్ల నిర్మాణాలను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తూర్పు రాజగోపురం ద్వార దర్వాజలకు బిగిస్తున్న ఇత్తడి తొడుగుల పనులను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా స్వామివారి గర్భాలయంలోకి వెళ్లిన ఆయన జయవిజయులు, ఉపాలయాలకు బిగించిన లైటింగ్పనులను పరిశీలించారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మితమవుతున్న స్ట్రక్చర్ పనులను, స్వామివారిని పాదయాత్ర ద్వారా దర్శించుకునేందుకు వచ్చే భక్తులకోసం నిర్మిస్తున్న శ్రీవారి మెట్ల నిర్మా ణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. శివాలయ పురవీధుల్లో నిర్మిస్తున్న గార్డెనింగ్, ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. ప్రహరీపై నిర్మిస్తున్న ప్యారాఫిట్ లైటింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నా రు. శివాలయంలో నిర్మిస్తున్న రథశాల ఎత్తుపై అధికారులకు పలు సూచనలు చేశారు. దాదాపుగా శివాలయ పనులు పూర్తయిన నేపథ్యంలో చివరి దశ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం కొండ చుట్టూ నిర్మితమవుతున్న రిం గు రోడ్డు, సర్కిల్ పనులు, ఫ్లై ఓవర్ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వైకుంఠద్వారం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, గండిచెరువు విస్తరణ పనులను పరిశీలించిన ఆయన చెరువులో స్వచ్ఛమైన గోదావరి జలాలు మాత్రమే నిల్వ ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు చెరువులోకి రాకుండా పైపులైన్ల ద్వారా మళ్లించాలని, ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఇంకా తుది దశ పనులు మిగిలి ఉన్నాయా అనే కోణంలో పరిశీలించాలని వైటీడీఏ అధికారులకు సూచించారు. అనంతరం యాదాద్రి కొండపైన గల హరిత హోటల్లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆయన వెంట కలెక్టర్ పమేలాసత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఎన్సీ రవీందర్రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, ఆలయ ఈవో ఎన్. గీత, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఆలయ ఈఈ రామారావు, తహసీల్దార్ అశోక్‌రెడ్డి, ఏఈవో శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.