
ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ‘ఇందిర జలప్రభ’ పథకంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కమీషన్లకు కక్కుర్తి పడి చేపట్టిన పనులు గిరిజన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలిగించలేకపోయాయి. రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లడంతో అప్పటి ప్రభుత్వం ఆ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.బోరు, విద్యుత్ సౌకర్యంతో సాగు భూములుగా మార్పు
యాదాద్రి భువనగిరి జిల్లాలో సత్ఫలితాలిస్తున్న పథకం సంతోషం వ్యక్తం చేస్తున్న గిరిజనులు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అదే పథకాన్ని ‘గిరి వికాసం’ పేరుతో అమలు చేస్తూ పునరుజ్జీవం కల్పిస్తున్నది. ఐటీడీఏతోపాటు మైదానం ప్రాంతాలకు పథకం వర్తింపజేయడంతో గిరిజనులకు లబ్ధి చేకూరుతున్నది. బోర్లు వేయడం, బావులు తవ్వించడం, విద్యుత్ సదుపాయం కల్పించడం వంటి పనులతో బీడు భూములు సాగులోకి వస్తున్నాయి. గతంలో మెట్టపంటలకే పరిమితమైన గిరిజనులు నేడు వరితోపాటు ఇతర పంటలు వేస్తూ ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ఈ పథకం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో 68 బ్లాకులను గుర్తించి రూ.11.5కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా మంచి ఫలితాలు వస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొండకోనల్లో పడావుబడ్డ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ అవస్థలు పడుతున్న గిరిజన రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ‘గిరి వికాసం’ పేరుతో చేయూతనిస్తున్నది. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజన రైతులు ఏండ్లుగా సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గిరి వికాసం పథకంలో భాగంగా బీడు భూములకు సాగు కళ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటూ ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నది. దీంతో గతంలో యేటా ఒక్క పంటనే అతి కష్టంగా పండించిన రైతులు ఇప్పుడు రెండు పంటలు పండించుకుంటున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, గద్వాల పరిధిలోని ఐటీడీఏ, మైదాన ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గిరిజన భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు 11.5కోట్లు..
జిల్లాలోని 17 మండలాల పరిధిలో 44,426 వరకు గిరిజన జనాభా ఉంది. ఇందులో అత్యధిక కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. గిరి వికాసం పథకం కోసం 68 బ్లాకులను గుర్తించి
అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం రూ.11.5కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పటివరకు వివిధ పనుల నిమిత్తం రూ.31.26లక్షలను ఖర్చు చేశారు. నాలుగు బ్లాకుల్లో 45 బోర్లకు విద్యుత్ కనెక్షన్ను కల్పించడంతోపాటు నాలుగు మోటర్లను ఏర్పాటు చేశారు. దీంతో నిన్నమొన్నటి వరకు బీడుగా పడిఉన్న భూములు నేడు సాగు కళను సంతరించుకున్నాయి. భూములు ఉన్నప్పటికీ సాగు నీరు అందుబాటులో లేకపోవడంతో కూలీనాలి చేస్తూ జీవనం గడిపేవారమని, గిరి వికాస పథకం వచ్చాక ఏటా
రెండు పంటలను పండించుకుంటున్నామని అక్కడి గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేద గిరిజన రైతులకు వరం
పేద గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వారికి వరంగా మారింది. సాగునీటి వసతికి దూరంగా ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఒకే చోట భూమి కలిగి ఉన్న రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే.. ఉపాధిహామీ పథకం కింద రాళ్లు రప్పలను తొలగించి చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటారు. నీటి వసతి కల్పించేందుకు సామూహికంగా బోరును రూ.60 నుంచి రూ.70వేలు వెచ్చించి ఏర్పాటు చేయడంతోపాటు కరెంట్ కనెక్షన్ కోసం రూ.80వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మోటర్ బిగించడం తదితర పనులను పూర్తిగా ప్రభుత్వమే చేయిస్తున్నది. గతంలో అమలు చేసిన పథకంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది.
ఒకప్పుడు జొన్నలు, కందులు.. ఇప్పుడు వరి పండిస్తున్నాం
ఒకప్పుడు నీటి వసతి లేక మా అన్న ధరావత్ భీమా, నేను మాకున్న నాలుగు ఎకరాల్లో జొన్నలు, కందులు పండించుకునేవాళ్లం. గిరి వికాసంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి మోటరు కూడా ఇచ్చిర్రు. గిప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండడంతో మొత్తం వరి వేసినం. గతంలో ఒక పంట పండడమే కష్టంగా ఉండె. ఇప్పుడు ఏటా రెండు పంటలు పండించుకుంటున్నం.