
యాదాద్రి, సెప్టెంబర్12: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో దర్శనం క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించి సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపించారు. అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాంటకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. కొండ కింద పాతగోశాలలోని వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.