
బీడీలు చుడుతూ అరకొర ఉపాధితో బతుకు వెళ్లదీస్తున్న బీడీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న ఆసరా పింఛన్లు కొండంత భరోసానిస్తున్నాయి. పీఎఫ్ సౌకర్యం ఉన్న వారికే పింఛన్లు పొందేందుకు అర్హత ఉండగా..సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో పీఎఫ్ లేని కార్మికులకు కూడా పింఛన్ అందించి ఆదుకుంటున్నారు. తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం అయిన వాసాలమర్రి గ్రామంలోని బీడీ కార్మిక కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం..35 కుటుంబాలకు పింఛన్లను మంజూరు చేయించారు. ఎన్నోఏండ్లుగా ఎదురు చూపులే మిగిలాయి తప్పితే..బీడీ కార్మికుల కుటుంబాలను గతంలో ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ దేవుడోలే ఆదుకుంటున్నారని బీడీ కార్మిక కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
23 ఏండ్లుగా బీడీలు చుడుతున్న. పింఛన్ కావాలని అడిగిన వారంలోపే మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఈ పింఛన్ మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధ్ది, సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో చరిత్రాత్మక దళితబంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి నుంచే నాంది పలికారు. దళితుల దిశ దశను మార్చే దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ వేదికగా కార్య రూపంలోకి తెచ్చేందుకు నిర్ణయించినప్పటికీ ఈనెల 4న దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఊహించని విధంగా దళిత బంధును లాంఛనంగా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించి మరుసటి రోజే రూ.10 లక్షల చొప్పున రూ.7.60కోట్లను కలెక్టర్ ఖాతాల్లో జమ చేయించారు. దళిత బంధుతో వాసాలమర్రిలోని దళిత కుటుంబాల ఆత్మీయతను సీఎం కేసీఆర్ చూరగొన్నారు. తాజాగా.. పింఛన్లను మంజూరు చేసి బీడీ కార్మిక కుటుంబాల ప్రేమకు పాత్రులయ్యారు.
సబ్బండ వర్గాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఇదే క్రమంలో వాసాలమర్రిలో వృద్ధ్దాప్య, వితంతు, వికలాంగులు, బీడీ కార్మికులు కలుపుకుని 241 మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో రెండో పర్యాయం పర్యటించిన సందర్భంగా 20 మంది మహిళా బీడీ కార్మికులు సీఎంను కలిసి పింఛన్లు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంలో ‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంటిలో ఉండే చదువుకున్నా. వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’.. అని పేర్కొన్న సీఎం కేసీఆర్ వారికి వెంటనే పింఛన్లను మంజూరు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు.
సెర్ప్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి 40 మందిని గుర్తించారు. 50 ఏండ్లకు పైబడిన నల్గురితో పాటు, ఓ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కారణంతో ఐదు దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావారి నుంచి బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. గురువారం ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలోనే పోస్టల్శాఖ ద్వారా వీరికి రూ.2,016 చొప్పున పింఛన్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎఫ్ సౌకర్యం ఉన్న వారికే పింఛన్లు పొందేందుకు అర్హత ఉండగా.. పీఎఫ్ లేని కార్మికులకు సైతం పింఛన్ అందించి ఆదుకున్నారు. వాసాలమర్రిలో 50 వరకు కుటుంబాలు బీడీలు చుట్టే బతుకుతున్నారు. బీడీ కార్మికులకు అందించే పింఛన్ ప్రస్తుతం ఒక్కరికే అందుతోంది. తాజాగా 35 మందికి పింఛన్లు మంజూరు కావడంతో వాసాలమర్రి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిది రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేశారని, సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా బీడీ కార్మికులు పేర్కొన్నారు.
ఇంటింటా తిరిగి ఆప్యాయంగా పలకరించిన ఆత్మబంధు సీఎం కేసీఆర్ సార్. 25 ఏండ్లుగా బీడీలు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఇప్పటివరకు ఏ సీఎం మమ్మల్ని పట్టించుకోలేదు. సార్ గ్రామానికి వచ్చి పింఛన్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
సీఎం కేసీఆర్ సార్ మా గ్రామానికి వచ్చి ఆత్మీయంగా పలకరించిండు. ఇంటి పెద్దలా యోగక్షేమాలను అడిగి తెలుసుకుండు. పింఛన్ కావాలని కోరిన వారంలోపే మంజూరు చేయడం ఆనందంగా ఉంది.
-బెజనబొయిన నిర్మల, బీడీ కార్మికురాలు వాసాలమర్రి
పింఛన్ కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్న. గతంలో ఏ ప్రభుత్వం మమల్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సార్ స్వయంగా మా ఇంటికి వచ్చి ఓపికగా సమస్యను అడిగి తెలుసుకుని వెళ్లిండు. ఇంత త్వరగా పింఛన్ మంజూరు చేస్తాడని అనుకోలేదు. సీఎం సార్కు రుణపడి ఉంటాం.
-కలకొండ నాగమణి, బీడీ కార్మికురాలు వాసాలమర్రి
20 ఏండ్లుగా బీడీలు చూడుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నా. ఎన్నో సార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ సార్ మా గ్రామానికి వచ్చి పింఛన్ మంజూరు చేసి కొండంతా అండగా నిలిచిండు.