
యాదాద్రి, సెప్టెంబర్ 11 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు చేశారు. నారసింహుడి జన్మ నక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు, శుద్ధ జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో సుమారు రెండు గంటలపాటు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా ఆలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో ఉంచి బాలాలయ మండపంలో ఊరేగించారు. భక్తులు వేకువజామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శతఘటాభిషేకం పూజల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్‌బాబు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
స్వామివారికి నిత్య పూజలు
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరుకల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టిక్కెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలు చేశారు. అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,08,964
రూ.100 దర్శనం టిక్కెట్ 25,000
వీఐపీ దర్శనాలు 75,000
నిత్య కైంకర్యాలు 10,518
సుప్రభాతం 300
క్యారీబ్యాగుల విక్రయం 4,100
వ్రత పూజలు 76,000
కల్యాణకట్ట టిక్కెట్లు 22,600
ప్రసాద విక్రయం 4,54,175
శాశ్వత పూజలు 16,116
వాహన పూజలు 10,000
టోల్గేట్ 1,180
అన్నదాన విరాళం 3,548
సువర్ణ పుష్పార్చన 85,400
యాదరుషి నిలయం 47,600
పాతగుట్ట నుంచి 17,580
ఇతర విభాగాలు 16,512
శ్రీవారి ఖజానాకు శనివారం రూ.10,74,593
ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.