రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తుండడంతో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ రూర్బన్ పథకంతో వాటి రూపురేఖలు మారనున్నాయి. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నారు. మండలానికి 10కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్ నేషనల్ రూర్బన్ పథకం అమలు చేస్తున్న గ్రామాల్లో 14అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేయనున్నారు. గ్రామంలోని యువతలో వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, వ్యవసాయాభివృద్ధి, ఆగ్రోప్రాసెసింగ్, వ్యవసాయ విస్తరణ సేవలు, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం, పశుగణాభివృద్ధి, డెయిరీ, ఉద్యానవనాభివృద్ధి, మత్స్యపరిశ్రమ ఏర్పాటు, విద్య, వైద్య సేవలు, 100 శాతం పారిశుధ్యం మెరుగు, రక్షిత మంచినీటి సౌకర్యం, డంపింగ్ యార్డు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాలు, ప్రజా రవాణా, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, డిజిటల్ అక్ష్యరాస్యత, మీ సేవా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
రూ.15కోట్లతో అభివృద్ధి పనులు
మండలంలోని పలు గ్రామాల్లో రూ. 15 కోట్లతో 267 పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రూ.7.80 కోట్లతో 185 పనులు పూర్తయ్యాయి. రూ. కోటి నిధులతో 20 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. రూ. 1.20 కోట్లతో 25 గ్రామపంచాయతీల్లో 4500 సోలార్ విద్యుద్దీపాలు, రూ. 2.42 లక్షలతో 25 పశువుల కొట్టాలు, రూ.కోటితో గుండ్లబాయి నుంచి సైదాబాయికి బీటీ రోడ్డు, రూ. 70 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, పలు పాఠశాలలకు ల్యాబ్ సౌకర్యం, ఆటస్థలాల పునరుద్ధరణ, రూ.10 లక్షలతో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో సంతకు రూ. 12 లక్షల చొప్పున 12 గ్రామాల్లో సంతల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 40 యూనిట్ల కూరగాయల పందిర్లు ఏర్పాటు చేయనున్నారు. మండలంలోని దండుమల్కాపురం గ్రామంలోని సరళమైసమ్మ దేవాలయంలో రూ. 30లక్షలతో షెడ్డు, రూ. 5లక్షలతో మంచినీటి సదుపాయం, రూ. 4 లక్షలతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు.
షీప్ యార్డు ఏర్పాటు..
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రూ. కోటితో క్లస్టర్ కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేశారు. రూ. 50లక్షలతో గొర్రెల మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తున్నారు. దీని పనులు పూర్తికావచ్చాయి. కొయ్యలగూడెంలో రంగుల అద్దకం, డిజైన్లు, మగ్గం వర్క్‌పై మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు
రూర్బన్ పథకంలో భాగంగా చౌటప్పల్ మండలంలో రూ. 15కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ప్రభుత్వం రూ.7.80 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సోలార్ విద్యుద్దీపాలు, పశువుల స్టాండ్లు, బీటీ రోడ్లు ఏర్పాటు చేశాం. పల్లెలు, పట్టణాల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.