కోలాహలంగా నిత్య పూజలు
యాదాద్రి, అక్టోబర్9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ హారతి నివేదించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచి, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కొండ కింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్యపూజలు జరిగాయి.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పైళ్ల దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బాలాలయ ముఖ మండపంలో వారికి స్వామివారి వేదఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదాద్రిలో బాల శివాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్రనామార్చనలతో పాటు ప్రదోశకాల పూజలు చేశారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650
రూ.100 దర్శనం టిక్కెట్ 26,700
వీఐపీ దర్శనాలు 68,100
నిత్యకైంకర్యాలు 200
వేద ఆశీర్వచనం 6,192
సుప్రభాతం 400
క్యారీబ్యాగుల విక్రయం 1,925
టెంకాయల విక్రయం 33,000
వ్రత పూజలు 46,000
కల్యాణకట్ట టిక్కెట్లు 22,200
ప్రసాద విక్రయం 3,09.900
వాహన పూజలు 12,500
టోల్గేట్ 1,280
అన్నదాన విరాళం 11,496
సువర్ణ పుష్పార్చన 94,800
యాదరుషి నిలయం 73,390
పాతగుట్ట నుంచి 15,850
గోపూజ 450
ఇతర విభాగాలు 11,211