
ఆలేరు టౌన్, ఆగస్టు 9 : నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నర్సరీలను చట్ట పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నర్సరీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నర్సరీల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణ బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించింది. రైతు నష్టపోతే పరిహారం చెల్లించే నిబంధన ఉండటంతో నాణ్యమైన మొక్కలు, నారు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా చర్యలు తప్పవు. ఇక నుంచి ఏ గ్రామంలో కొత్త నర్సరీ ఏర్పాటు చేయాలనుకున్నా తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ నర్సరీలో ఏ మొక్కలు లభిస్తాయి? ఎంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతారు? అనే పూర్తి వివరాలు ఉద్యాన శాఖ అధికారులకు తెలుపాల్సి ఉంటుంది. జిల్లాలో మూడు నర్సరీలు ఉన్నాయి. ఇందులో ఒక్కదానికి మాత్రమే అనుమతి ఉన్నది.
ఉద్యాన నర్సరీ చట్టం -2017 ప్రకారం నర్సరీల్లో పెంచే మొక్కలు నాణ్యతా ప్రమాణాలతో ఉండాలి. మొక్కల పరిమాణం, ప్రమాణాలను బట్టి ధరలు ఉండాలి. నాణ్యత గల తల్లి చెట్టు రకాలను కలిగి ఉండటం, షెడ్ నెట్లో ఆరోగ్యకరమైన నార్లు పెంచడం, మొక్కలు తీసుకున్న రైతులకు బిల్లు ఇవ్వడం, నర్సరీల్లో వినియోగించే విత్తనాలు ఏ కంపెనీకి చెందినవో రికార్డుల్లో నమోదు చేయాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడి నుంచి సేకరించారు, బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారు చేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల తయారీకి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. వీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షెడ్ నెట్ హౌజ్, నెట్ హౌజ్, పాలిటన్నెల్, చాంబర్ తదితరాలు సమకూర్చుకోవాలి.
నర్సరీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైన దరఖాస్తు ఫారాలు జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫారం నింపి చిరునామా, నర్సరీ ఫొటో, భూమి పట్టాదారు, పాస్‌బుక్ జిరాక్స్, లీజు డాక్యుమెంట్, నర్సరీ లే-అవుట్ చిత్రం, నర్సరీలో మౌలిక సదుపాయాలు, భూమి, నీటి పరీక్షల నివేదికలు, మూడేండ్ల ఉత్పత్తి, నర్సరీల డిజిటల్ ఫొటో కాఫీ, చలాన రసీదు సమర్పించాలి. పండ్ల మొక్కల ఉత్పత్తికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5వేలు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కలు రూ.2లక్షల నుంచి 4లక్షల ఉత్పత్తికి రిజిస్ట్రేషన్ రుసుము రూ.వెయ్యి, 4లక్షలకు మించి ఉత్పత్తికి రూ. 2,500 నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ లేకుంటే మొక్కలు కొనుగోలు చేయవద్దు. రైతులు కూడా నారు కొనే ముందు నర్సరీకి లైసెన్స్ ఉందా? లేదా తెలుసుకోవాలి. అంతే కాకుండా నర్సరీదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలి. పండ్ల మొక్కల నర్సరీ లైసెన్స్‌ను మూడేండ్ల ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధం, అలంకరణ మొక్కల విక్రయానికి ఏడాదికోసారి రెన్యువల్ చేసుకోవాలి. అలాగే నర్సరీలను ఏర్పాటు చేసుకునే యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మొక్కలు, నారు ఉత్పత్తి విక్రయించేందుకు అనర్హుడవుతాడు. నిబంధనలు అతిక్రమించి క్రయవిక్రయాలు జరిపితే రూ.50వేల వరకు జరిమానా/ఒక సంవత్సరం జైలు శిక్ష/ రెండు కలిపి విధించే అవకాశం ఉన్నది.
2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రీయ ఉద్యాన మిషన్ స్కీం కింద పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. అరటి, బొప్పాయి, మామిడి, సీతాఫలం, జామతోపాటు 20 ఏండ్లు పైబడిన మామిడి తోటల పునరుద్ధరణ, కూరగాయల తోటల్లో కలుపు నివారణకు మల్చింగ్, ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే షెడ్ నెట్‌కు రాయితీలు ఇవ్వనున్నది. కొత్తగా పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు మొక్కలు, ఎరువులు, పురుగుల మందులకు 40శాతం రాయితీ ఇస్తుంది. మామిడి హెక్టార్‌కు రూ.16,400, బత్తాయి రూ.16,001, అరటి రూ.40,985, బొప్పాయి రూ.30,000, జామ రూ.29,332, సీతాఫలం రూ.42,800 ఇస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్ సాగుకు రూ.1.60శాతం రాయితీ ఇస్తారు. అంతే కాకుండా సాగు విస్తీర్ణం పెంచేందుకు 40శాతం రాయితీపై టమాట, వంకాయ, పచ్చిమిర్చి నారును కూడా సరఫరా చేస్తారు. రాయితీపై బ్రష్ కట్టర్లు, ట్రాక్టర్ మౌంటేడ్, స్ప్రేయర్లను సరఫరా చేస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, ఓసీ సన్నకారు రైతులకు 90శాతం, ఓసీ పెద్ద రైతులకు 80శాతం రాయితీ ఉంటుంది. బిందు సేద్యం కోసం 80శాతం రాయితీ ఇస్తారు.
నర్సరీల నిర్వహణపై ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించాలి. అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నది. రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నర్సరీ చట్టాన్ని తీసుకువచ్చింది. రైతులు కూడా రిజిస్టర్డ్ అయిన నర్సరీల నుంచే కొనుగోలు చేయాలి. రసీదులను భద్రపర్చుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే చర్యలు తప్పవు. జిల్లాలో 3 నర్సరీలు ఉన్నాయి. ఒక్కదానికే రిజిస్ట్రేషన్ ఉన్నది. చేయించుకోని వారికి నోటీసులు అందజేశాం. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.