
శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం, పండుగల మాసం అని కూడా అంటారు. ఈ నెల రోజులూ శుభకరమే. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైంది. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ నిత్యపూజలతో అలరారుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తులు కొవిడ్ నిబంధనల మధ్య దర్శించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆలయం ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారనున్నది.
ఆలేరు టౌన్, ఆగస్టు 8 : ఆధ్యాత్మిక భావాలకు నెలవు మన దేశం. ఆషాఢ మాసం జాతర సంబురాలు ఘనంగా జరుపుకొని కాలస్పృహలో కదిలిపోయిన వెంటనే దీక్షాధారణ శుభోదయానికి.. రక్షాబంధన మహోదయానికి.. వరలక్ష్మీవ్రతాల ఆధ్యాత్మిక శుభ దినాలకు.. కృష్ణాష్టమి వేడుకలకు.. నాగపంచమి పూజలకు.. కల్యాణశుభ ఘడియలకు పెట్టింది పేరు శ్రావణమాసం. శ్రావణ మాసంలో భక్తజనం విశేష ఆచారాలు, పూజలతో అమ్మవారిని కొలుస్తారు. వర్షఋతువులో వచ్చే శ్రా‘వనం’లో నేల తల్లి పంచే పచ్చదనాన్ని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ఆనందపడుతారు.
ప్రతి స్వల్పకాలిక పూలమొక్క వికసించేది వర్షరుతువులోనే.. ఈ మాసంలో అమ్మవార్లకు జరిపే ప్రత్యేక పుష్పాలంకరణ కోసం పూలను సేకరించడంలో ఎంతో మానసిక ఉల్లాసం ఉంటున్నదని శాస్త్రీయమైన సూచన. పరస్పరం ఇచ్చుకునే వాయినాల్లో స్నేహశీలత కన్పిస్తుంది. బేధాలు లేకుండా ఒకరికొకరు కాళ్లకు పసుపు రాసుకోవడం, ప్రసాదాలు, పండ్లు ఇచ్చి పంచుకోవడంలో సామరాస్యత కన్పిస్తుంది. ఈ కాలంలో అధికంగా వచ్చే క్రిమికీటకాలు ఇండ్లలోకి రాకుండా అనునిత్యం గడపలకు రాసే పసుపు ఔషధంగా పని చేస్తుంది. శ్రావణ మాసంలో గో పూజల్లో అత్యంత ఔషధ గుణాలు ఉండే పంచకం, గోమయం వినియోగంలో సామూహిక పారిశుధ్యం అన్న వైద్య సూత్రం విమిడి ఉంటుంది.
శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో పూజలు, వ్రతాల్లో లీనమవుతారు మహిళలు. వరలక్ష్మీ వ్రతాలు, మంగళ గౌరీ వ్రతాలు, శ్రావణ శుక్ర, శని, సోమ వారాలు, నాగులచవితి, పంచమి, గరుడపంచమి, రాఖీపౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా ఒకేసారి పండుగల సందడి ఉండటం శ్రావణమాసపు ప్రత్యేకం. శ్రావణశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమయ్యే పూజల సందడి నెల పాటు కొనసాగుతుంది. నిర్ణీత తేదీల్లో వరలక్ష్మీ వ్రతాలు చేసుకోలేనివారు రాఖీపౌర్ణమి రోజు సామూహిక వ్రతాలు నిర్వహించుకుని శ్రావణమాస వేడుకలకు వీడ్కోలు చెబుతారు. గౌరీ పూజ, లక్ష్మీపూజ ఇలా ఎన్నో ఉంటాయి.
మంగళ గౌరీ వ్రతం ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతం. మంగళగౌరీ వ్రతం ప్రత్యేకంగా కొత్తగా పెండ్లి అయిన నవవధువుల కోసం. పెండ్లయిన ఐదేండ్ల పాటు ఏటా ఈ వ్రతం మహిళలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉద్యాపన నిర్వహించి ముగిస్తారు. తాము ఎప్పుడూ సుమంగళిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వ్రతం చేపడుతారు. ఇక ఏటా మహిళలు నిర్వహించేది వరలక్ష్మీవ్రతం. కుటుంబం, పిల్లలు, భర్త చల్లగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే దీన్ని నిర్వహిస్తారు. శ్రావణ శుక్ర, శని, సోమ వారాల్లోనూ లక్ష్మీదేవి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినాల రూపంలో పండ్లు, పూలు, కానుకలు ఇస్తారు. శుక్లచవితి- నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోసి పూజిస్తారు. శుక్ల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర, సంతానం కలుగుతుందని నమ్మకం. శ్రావణ పూర్ణిమ- హయగ్రీవ జయంతి రోజు వేదాలను రక్షించిన మహా విష్ణువు హయగ్రీవం ధరించిన రోజు. హయగ్రీవ పూజ చేసిన రోజు శనిగలు, ఉల్వలు, గిగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించాలి.
శ్రావణమాసం సందర్భంగా చేసే ప్రసాదాలు, వంటకాలు, వాయినాలలో ఆరోగ్యం దాగి ఉందని వైద్యులు చెబుతున్నారు. బెల్లంతో చేసే భక్షాలు, పూర్ణం బూరెలు శరీరంలో ఐరన్‌ను పెంచుతాయి. బియ్యం పిండితో ప్రత్యేకంగా చేసే జ్యోతిపిండి వర్షాకాలంలో వచ్చే వాంతులు, విరేచనాలను నిరోధిస్తాయి. మత్తయిదువులకు ఇచ్చే శనిగలు వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. నాగులపంచమికి చేసే నువ్వుల ఉండలు, గోకులాష్టమికి చేసే పులిహోరలు, సొంటి ప్రసాదం వంటివి శరీరంలోకి అన్ని విటమిన్లను పంపిస్తాయి. సాధారణంగా తినడానికి ఇష్టపడనివి కూడా ప్రసాదం రూపంలో ఇస్తే తప్పకుండా తీసుకుంటారనే ఉద్దేశంతో వీటిని పెద్దలు ప్రసాదాలుగా రూపొందించారని చెబుతుంటారు.
శ్రావణమాసం వివాహాలకు, శుభ కార్యాలకు ప్రసిద్ధి. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉంటాయి. ఈ నెలలో పెండ్లీ పీఠలు ఎక్కేందుకు యువత సిద్ధమవుతుంది. ఆషాఢం తరువాత ముహూర్తాలు రావడంతో అనుబంధ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆషాఢ మాసంలో శుభ కార్యాలు ఉండవు. అంతే కాకుండా ఈ మాసంలో వరలక్ష్మీవ్రతాలకు బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.
నిత్యపూజలు
శ్రావణ మాసం మాకు ఇష్టం. వ్రతాల పేరిట దేవాలయాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ నెలలో మహిళలు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు. లక్ష్మీ, గౌరీ అమ్మవార్లను ఆరాధిస్తాం. కొవిడ్ నేపథ్యంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. శ్రావణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.
ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఉపవాస దీక్షలతో పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రావణంలో ఆచరించే అన్ని క్రియలకు మంచి ఫలితాలు జరుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. మహాలక్ష్మీ ఆరాధన ఎంతో ఉపయోగాన్నిస్తుంది. సోదరిసోదర అనుబంధానికి అద్దం పట్టే రాఖీపౌర్ణమి ఈ నెలలోనే పలకరిస్తుంది.
శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఉంటాయి. మంగళ, శుక్రవారాల్లో వ్రతాలు ఆచరిస్తే సఖల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణమాసం భ్రమరాంబిక దేవికి ఇష్టమైన మాసం. మాసంలో అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది. శ్రావణమాసంలో ఈశ్వరునికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, భ్రమరాంబికా దేవికి లక్ష కుంకుమార్చనలు చేసుకోవడం శుభప్రదం.