వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి
భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 7: చౌటుప్పల్ శివారులో ఈనెల 2న లారీ క్యాబిన్లో హత్యకు గురైన నర్సింహారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ కే.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి చెందిన కడియం మమత కుటుంబం జీవనోపాధి కోసం 13 ఏండ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి స్థిరపడింది. నర్సింహారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటూ యజమానితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. కొన్ని రోజుల క్రితం నర్సింహారెడ్డికి మమత రూ.15వేలు అప్పుగా ఇచ్చింది. కుమారుడు పెద్దవాడు అయ్యాడని వివాహేతర సంబంధం కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే నర్సింహారెడ్డి మమతకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2న రాత్రి 12 గంటలకు నర్సింహారెడ్డి మమతకు ఫోన్ చేసి తనతో రమ్మని కోరాడు. కుదరదని ఎంత చెప్పినా వినక పోగా, ఇంటికి వచ్చి పరువు తీస్తానని భయపెట్టడంతో ఎప్పటికైనా నర్సింహారెడ్డితో ఇబ్బంది తప్పదేమోనని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 2న రాత్రి 12 గంటలకు నర్సింహారెడ్డితో బొర్రలగూడెం బస్‌స్టేజీ వద్ద పార్కింగ్‌లో లారీని నిలిపి మద్యం తాగారు. అనంతరం మృతుడు బలవంతం చేయడానికి యత్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 3న తెల్లవారుజామున లారీ క్యాబిన్లో కూరగాయలు తరిగే కత్తితో నర్సింహారెడ్డి ఛాతిలో బలంగా పొడిచి, చనిపోయాడని నిర్ధారించుకుంది. అనంతరం కత్తిని పక్కనే ఉన్న పొదల్లో విసిరేసి వెళ్లిపోయింది. నర్సింహారెడ్డి తమ్ముడు లింగారెడ్డి, తండ్రి యాదిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును విచారణ చేపట్టారు. మమత కదలికలు అనుమానాస్పందంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, ఎస్హెచ్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.