ఒకే స్కూళ్లో, ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకొంటున్న విద్యార్థుల్లో కొందరికి ‘స్టూడెంట్ ఐడీ కార్డులు’ జారీ చేసి, పుస్తకాలు, పెన్నులు, బస్‌పాస్‌లు ఇచ్చి, మరికొందరికి అవేవీ ఇవ్వకపోతే.. దాన్ని ఏమంటాం? సింపుల్‌గా వివక్ష! ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కూడా అక్షరాలా ఇదే రకమైన వివక్ష ప్రదర్శిస్తున్నది. ఒకే ఆఫీసులో, ఒకే చోట, పక్కపక్కనే కూర్చొని ఒకేరకమైన విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల్లో కొందరికి మాత్రమే అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామంటూ ఒక్కో మీడియా సంస్థకు ఒక్కో రకమైన కోటా నిర్ణయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు సుదీర్ఘ పోరాటం చేశారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మునుపెన్నడూ, మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా దాదాపు 23 వేల అక్రెడిటేషన్లు జారీ అయ్యాయి. అయితే, వీటి కాల పరిమితి ముగియడంతో జర్నలిస్టుల కథ మళ్లీ మొదటికి వచ్చింది. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని, 44 వేల కంటే ఎక్కువమందికి మంజూరు చేస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నప్పటికీ, అదే శాఖ కమిషనర్ జారీ చేస్తున్న జీవోలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. తొలుత జారీ చేసిన జీవో-252, ఆ తర్వాత ఇచ్చిన సవరణ జీవో-103 ప్రకారం…
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో సగం మందికి కూడా అక్రెడిటేషన్ కార్డులు దక్కే అవకాశం కనిపించడం లేదు. అక్రెడిటేషన్ అనేది ‘ఇతను జర్నలిస్టు’ అని గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసే ఒక ఐడెంటిటీ కార్డు. ఇందుకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత, ఐదేండ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అక్రెడిటేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో, కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీల్లో రాయితీలు ఇస్తుంటాయి.
అయితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో రైల్వే చార్జీల్లో రాయితీలను ఎత్తివేసింది. వాటిని పునరుద్ధరించలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవల నిమిత్తం అందజేస్తున్న ఈజేహెచ్ఎస్ హెల్త్ కార్డులను కూడా అక్రెడిటేషన్ ఆధారంగానే మంజూరు చేస్తున్నారు. అవి కూడా ప్రభుత్వ దవాఖానల్లో తప్ప ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పనిచేయడం లేదు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాల మీద ప్రెస్ అని రాసుకోవాలని ఇటీవల సమాచార శాఖ మెమో జారీ చేసింది. ఒకవైపు, అక్రెడిటేషన్ కార్డులకు, జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధం ఉండదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంటున్నదనేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది. కానీ, నూతన అక్రెడిటేషన్ పాలసీ పేరిట గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో-252లో అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డుల పేరిట రెండు రకాల కార్డులు ఇస్తామంటూ జర్నలిస్టుల మధ్య విభజన రేఖ గీసింది. వివిధ మీడియా సంస్థలకు ఇచ్చే కార్డుల సంఖ్య విషయంలోనూ అనేక పరిమితులు విధించింది. దీనిపై జర్నలిస్ట్ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జీవో-252లో పేర్కొన్న ‘మీడియా కార్డు’ అనే పదాన్ని ‘అక్రెడిటేషన్ కార్డు’గానే పరిగణిస్తూ సవరణ జీవో-103 పేరిట విడుదలైంది. అయితే, వివిధ మీడియా సంస్థలకు ఇవ్వజూపిన కార్డుల సంఖ్యపై పరిమితులు తొలగించలేదు. గతంలో మాదిరిగానే అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రధా న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ జీవోల ప్రకారం.. పత్రికల సర్క్యులేషన్ ప్రాతిపదికగా వాటిని పలు క్యాటగిరీలుగా విభజించి, ప్రతి మీడియా సంస్థకూ పరిమిత సంఖ్యలోనే అక్రెడిటేషన్లు జారీ చేయనున్నారు. జనరల్ క్యాటగిరీలో (పత్రిక ప్రధాన ఆఫీసులో పనిచేసే స్టేట్ బ్యూరో, సెంట్రల్ డెస్క్, ఇతర స్పెషల్ డెస్క్‌లు, ఫొటోగ్రాఫర్లు, కలిపి) 2.5 లక్షలకు మించి సర్క్యులేషన్ ఉన్న పత్రికల నుంచి రిపోర్టర్లకు 12, డెస్క్ జర్నలిస్టులకు 12, ఫొటోగ్రాఫర్లకు రెండు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నారు. 75 వేల నుంచి 2.5 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికల నుంచి రిపోర్టర్లకు 8, డెస్క్ జర్నలిస్టులకు 8, ఫొటో గ్రాఫర్‌కు ఒకటి ఇస్తారు. 25 వేల నుంచి 75 వేల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికల విషయంలో రిపోర్టర్లకు 6, డెస్క్ జర్నలిస్టులకు 6, ఫొటోగ్రాఫర్‌కు ఒకటి ఇవ్వనున్నారు.
జిల్లాల్లో పనిచేసే డెస్క్ జర్నలిస్టులతోపాటు కార్టూనిస్ట్లకూ కోటా ఇవ్వలేదు.శాటిలైట్ చానల్స్‌కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసే రిపోర్టర్లకు 8, డెస్క్ జర్నలిస్టులకు 8, కెమెరామెన్‌కు 8 కార్డుల చొప్పున ఇస్తారు. వాస్తవానికి ఆయా పత్రికలు, శాటిలైట్ చానల్స్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్ సంఖ్యతో పోల్చుకుంటే ఇవి సగం కూడా ఉండవు. మరి మిగిలినవారి పరిస్థితి ఏమి టి? ఈ విధానం ప్రకారం.. ఎన్నో ఏండ్లుగా వివిధ సంస్థల్లో జర్నలిస్టులుగా పనిచేస్తూ, ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులు కలిగిన చాలామంది జర్నలిస్టులు కూడా తమ గుర్తింపు కార్డులను కోల్పోవాల్సి వస్తుంది. అక్రెడిటేషన్తోపాటు తమకు ఎంతో కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తున్న బస్‌పాస్‌లు, హెల్త్‌కార్డులు కూడా కోల్పోక తప్పదన్న ఆందోళన జర్నలిస్టుల్లో వ్యక్తమవుతున్నది.
నిజానికి, అడ్వర్టయిజ్మెంట్ల టారిఫ్‌కు ఉద్దేశించిన సర్క్యులేషన్ ప్రమాణాలను జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులకు వర్తింపజేయడం అర్థరహితం. ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ, వారికి ప్రస్తుతం మీడియా రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కానీ, జర్నలిస్టుల సమస్యల మీద కానీ ఏమాత్రం అవగాహన ఉన్నట్టు లేదు. అసలు.. సర్క్యులేషన్కూ, అక్రెడిటేషన్ కార్డులకూ ముడిపెట్టడం ఏమిటి? జర్నలిస్టును జర్నలిస్టుగా గుర్తించడానికి పరిమితులు విధించడం ఏమిటి?
నిజానికి పత్రిక ‘సర్క్యులేషన్’ అనేది జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారం కాదు. ‘సర్క్యులేషన్’ పెంచడమనేది వారి డ్యూటీ కాదు. వార్తల సేకరణ, జర్నలిజం ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడం, అందరికీ అర్థమయ్యేలా వాటిని ప్రజెంట్ చేయడమే పత్రికలు, న్యూస్ చానళ్లలో వారి విధి. ‘సర్క్యులేషన్’ పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది పూర్తిగా యాజమాన్యాల ఆర్థిక స్థోమతకు సంబంధించిన వ్యవహారం. తమ సంస్థకు అందుబాటులో ఉన్న నిధులు, ఆదాయ, వ్యయాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకొంటాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా సంస్థల నిర్వహణ పెనుభారంగా మారుతున్నది. ముఖ్యంగా కరోనా తర్వాత మీడియా రంగం స్వరూపంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఒడిదొడుకులను ఎదుర్కొంటుండగా, డిజిటల్ మీడియా విస్తృతమవుతున్నది. మరోవైపు న్యూస్ ప్రింట్‌తోపాటు ఇతర ముద్రణా ఖర్చులు, రవాణా వ్యయాలు విపరీతంగా పెరగడం, అందుకు తగ్గట్టుగా యాడ్ రెవెన్యూ లేకపోవడంతో పత్రిక నిర్వహణ పెను సవాల్‌గా మారుతున్నది. ఈ నేపథ్యంలో డిమాండ్ ఉన్నప్పటికీ, సర్క్యులేషన్ పెంచుకునేందుకు పత్రికా యాజమాన్యాలు సాహసించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.
అయినప్పటికీ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొని రావడంలోనూ, వివిధ ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యం కల్పించడంలోనూ, వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై విశ్లేషణలు అందించడంలోనూ, రానున్న ఉపద్రవాలపై సమాజాన్ని జాగృతం చేయడంలోనూ పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్నీ మీడియా సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రదర్శిస్తున్న నిబద్ధత, వృత్తి పట్ల ఉన్న అంకితభావమే ఇందుకు కారణం. ఆయా కథనాలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వేగంగా షేర్ అవుతూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ, సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాలకులు ఈ విషయాన్ని విస్మరించకూడదు. ప్రభుత్వం ఎటువంటి భేషజాలకు పోకుండా అక్రెడిటేషన్ విధానాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవాలి. ఎవరు ఏ సంస్థలో పనిచేస్తున్నారనే అంశాన్ని కాకుండా వృత్తి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకొని సహేతుకమైన విధానం రూపొందించాలి. జర్నలిజంలో ఉన్న అనుభవం, నిర్దేశిత విద్యార్హతలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అక్రెడిటేషన్ జారీ చేస్తేనే అది సమన్యాయం అనిపించుకుంటుంది. అంతే తప్ప జర్నలిస్టులకు సంబంధం లేని అంశాలను నిబంధనల్లో రూపొందించి, అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను కుదించడమంటే ‘మీడియా స్వేచ్ఛ’ మీద పరోక్షంగా సెన్సార్ విధించడమే అవుతుంది.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొని రావడంలోనూ, వివిధ ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యం కల్పించడంలోనూ, వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై విశ్లేషణలు అందించడంలోనూ, రానున్న ఉపద్రవాలపై సమాజాన్ని జాగృతం చేయడంలోనూ పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్నీ మీడియా సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రదర్శిస్తున్న నిబద్ధత, వృత్తి పట్ల ఉన్న అంకితభావమే ఇందుకు కారణం.
– కందిబండ కృష్ణప్రసాద్ 9182777010