Hema | తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా గడిపిన నటి హేమ ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన ఆమె ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఆయన సమాధిని సందర్శించిన హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో నటి హేమ కూడా ఆయన సమాధి వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దాసరి సమాధి పరిస్థితిపై ఇటీవల ఒక వీడియో చూసిన తర్వాత తాను అక్కడికి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
గురువుగారి వర్థంతి అని నాకు గుర్తు లేదు. కానీ ఒక వీడియో చూసిన తర్వాత ఆయన సమాధి వద్దకు రావాలనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా చాలా చక్కగా శుభ్రం చేసి ఉంది. గురువుగారే మమ్మల్ని ఇక్కడికి పిలిపించినట్లుగా అనిపిస్తోంది అని హేమ పేర్కొన్నారు. దాసరి నారాయణరావు తనకు గురువుతో సమానమని చెప్పిన హేమ, ఆయన జీవించి ఉండి ఉంటే తన జీవితం మరోలా ఉండేదని అన్నారు. సినీ పరిశ్రమలో తన ప్రయాణానికి ఆయన అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “గురువుగారు ఉంటే నా కెరీర్ మరింత భిన్నంగా ఉండేది. ఆయన ఆశీస్సులతో మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
అంతేకాకుండా రాజకీయాలపై కూడా తన ఆసక్తిని మరోసారి బయటపెట్టారు. “నేను మంచి రాజకీయ నాయకురాలిగా ఎదగాలని గురువుగారు ఆశీర్వదించాలి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో భవిష్యత్తులో మళ్లీ రాజకీయాల్లో చురుకుగా కనిపించే అవకాశాలున్నాయా అనే చర్చ మొదలైంది.వాస్తవానికి హేమకు రాజకీయాలతో కొత్త పరిచయం కాదు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తానని ప్రకటించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో పలు వివాదాల కారణంగా కూడా హేమ వార్తల్లో నిలిచారు. అదే సమయంలో సినీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు దాసరి సమాధి వద్ద చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ కావడంతో పాటు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.