
ఈఎన్సీ రవీందర్రావు ఆదేశం
యాదాద్రి, సెప్టెంబర్7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రధానాలయంతోపాటు క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం, శివాలయం, శ్రీవారి మెట్ల నిర్మాణం, ఉత్తరభాగంలో కొనసాగుతున్న ప్రహరీ, ఎస్కలేటర్ పనులను పరిశీలించారు. కొండకింద వైకుంఠ ద్వారం వద్ద నిర్మిస్తున్న సర్కిల్, గిరిప్రదక్షిణ రోడ్డు, కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక బ్రిడ్జి, గండి చెరువు పనులను పరిశీలించారు. కొండపై పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏడీఈఈ సునీల్‌కుమార్, విద్యుత్ ఎస్ఈ శ్రీనాథ్, డీఈ మల్లికార్జున్, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.