కొత్తగూడెం కార్పొరేషన్‌కు సంబంధించి ఎట్టకేలకు సీపీఐ పంతం నెగ్గించుకుంది. మేయర్ పదవి తనకే ఇవ్వాలన్న సీపీఐ డిమాండ్‌కు కాంగ్రెస్ తలొగ్గింది. సీపీఐకి బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇవ్వడాన్ని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్‌ను సీపీఐ దారిలోకి తెచ్చుకుంది. దీంతో సీపీఐ రాష్ట్ర నాయకుడు పల్లా వెంకటరెడ్డి కాంగ్రెస్ నేతలు, సీఎంతో జరిపిన చర్చలు శనివారం రాత్రి కొలిక్కి వచ్చాయి. మేయర్ పీఠాన్ని సీపీఐ పార్టీకి ఇవ్వడానికి అంగీకరించిన కాంగ్రెస్.. ఒక మెలిక పెట్టింది. మొదటి రెండున్నర సంవత్సరాలు సీపీఐకి, తర్వాత రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్‌కు మేయర్ పదవి ఇవ్వడానికి సీపీఐ అంగీకరించింది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారంపై చర్చలు జరిపారు. సీపీఐకి 22 స్థానాలు, కాంగ్రెస్‌కు 22 స్థానాలు రావడంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి అవసరమైన 31 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను ఇరు పార్టీలు చేరుకోలేకపోయాయి. దీంతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు హంగ్ ఏర్పడింది. సీపీఐకి బీఆర్ఎస్ బేషరతు మద్దతు ప్రకటించడంతో అప్రమత్తమైన కాంగ్రెస్.. సీపీఐని మచ్చిక చేసుకొని మిత్రపక్షాన్ని కాపాడుకునేందుకు మేయర్ పదవిని ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే, డిప్యూటీ మేయర్ పదవిని కూడా మొదటి రెండున్నరేళ్లు కాంగ్రెస్, తదుపరి రెండున్నరేళ్లు సీపీఐ తీసుకునేలా అంగీకారం కుదిరింది. అయితే, ఈ విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన పంతం నెగ్గించుకున్నారు.
-ఖమ్మం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇక ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్‌లో పోరు ప్రారంభమైంది. పాత, కొత్త కాంగ్రెస్ నేతలు ఈ పదవుల కోసం పట్టుబట్టడంతో పలు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాని పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అక్కడ చైర్పర్సన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదవి ఆశిస్తున్న ముగ్గురు మహిళలు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ మహిళకు అవకాశం వచ్చినందున తమ సామాజిక వర్గాలకు ఈ చైర్మన్ పదవి ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని కలిసి విన్నవించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు మహిళా నేతలు చైర్పర్సన్ పదవికి తమ ప్రత్యేక అర్హతలు, సామాజిక వర్గాల అండదండలు వంటి వాటిని ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండడం విశేషం. ఈ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన తోట సుజలారాణి, బొంతు సుమలత, రెహమున్నీసా బేగం మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఒక్కొక్క పేరు చెప్పే అవకాశం ఉంది. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి మదిలో మరో అభ్యర్థి పేరు ఉందన్న ప్రచారం ఆసక్తి కలిగిస్తోంది. వీరందరినీ పార్టీ ఎలా సమన్వయ పరుస్తుందోనన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రేపు చైర్మన్ల ఎన్నిక..
ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు ఎన్నిక ఉండడంతో ఈ నెల 15లోపు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికను పార్టీ పూర్తి చేస్తుందన్న అభిప్రాయం ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రత్యేక క్యాంపులను ఆ పార్టీ నిర్వహిస్తోంది. క్యాంపులకు హాజరైన ఆశావహులు సైతం పార్టీ ముఖ్య నేతల ఆశీస్సుల కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తుండడం విశేషం. ఇక ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఈ మున్సిపాలిటీలోనూ భారీ పోటీ నెలకొంది. నలుగురు మహిళలు చైర్పర్సన్ అభ్యర్థులుగా ప్రచారం కావడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య ఈ పదవి దోబూచులాడే పరిస్థితి ఉందని, కచ్చితంగా పాత కాంగ్రెస్ వారికే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, చైర్‌పర్సన్‌గా తనకే అవకాశమిస్తామంటేనే పోటీ చేశామంటూ మరో మహిళా అభ్యర్థికి చెందిన నేతలు పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మున్సిపాలిటీలో పార్టీ విధేయులకు, విద్యావంతులకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక, కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఈ మున్సిపాలిటీ నుంచి ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి అర్హత సాధించారు. అయితే, వీరిలో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న అంశం ఆసక్తి కలిగిస్తోంది. ఎస్టీ జనరల్ స్థానమైన కల్లూరు మున్సిపల్ చైర్మన్ పదవివి మహిళకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మహిళలు గెలవడంతో ఇద్దరూ పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్టీ జనరల్‌కు అవకాశమిస్తే మోహన్‌నాయక్‌కు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైరా మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన కాపా చంద్రకళ పేరును పార్టీ దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవి ఆశించి పోటీ చేసి విజయం సాధించిన కీలక నేత తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక, జనరల్ మహిళకు రిజర్వు అయిన మధిర మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఉప ముఖ్యమంత్రి భట్టికి అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి లక్ష్మీ తులసి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న వారిలో శేషమ్మ, అనిత, కృష్ణకుమారి, సునీత ఉన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా జూపల్లి శశికళ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇల్లెందులో బీసీలకు కేటాయించిన మున్సిపల్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు మహిళలు పోటీపడుతున్నారు. ఈ పదవి ఆశిస్తున్న ఒక మహిళా విజేత ఇప్పటికే కాంగ్రెస్ విజేతలతో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపులో ఉన్న ఒకరిద్దరు మహిళా విజేతలు సైతం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.