నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి14(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపైకి మళ్లింది. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు మిగతా ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఎవరు అధిరోహిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పలుచోట్ల చైర్మన్ స్థానాలను ఖరారు చేయగా మరికొన్ని చోట్ల సస్పెన్స్ కొనసాగుతోంది. వైస్ చైర్మన్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టత కానరావడం లేదు. ఇదే సమయంలో అన్ని చోట్లా అధికార పార్టీ విజేతలందరినీ ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక శిబిరాలకు తరలించారు. ఎల్లుండి ఉదయం వరకు కొనసాగే శిబిరాల్లోనే చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు కొలిక్కిరానుంది. నల్లగొండ కార్పొరేషన్లో మాత్రం మంత్రి కోమటిరెడ్డి ఊహించిన దానికి భిన్నమైన ఫలితాలు రావడంతో ఇక్కడ సంతృప్తికర సంఖ్య కోసం ఆపసోపాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం స్వతంత్రులతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు గాలం వేస్తున్నట్లు సమాచా రం.
మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను తేల్చడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కార్పొరేషన్లో మేయర్‌గా ఇప్పటికే 32వ డివిజన్ విజేత బుర్రి చైతన్యశ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ ఎవరికీ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. మైనార్టీలకు ఇస్తారన్న సంకేతాలున్నా యాద వ్ లేదా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటివరకు మంత్రి పెదవి విప్పలేదని తెలిసింది. ఫలితాలు మంత్రి కోమటిరెడ్డిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయనే చెప్పొచ్చు. నల్లగొండలో 40కి పైగా స్థానాలను గెలుపొందుతామని మంత్రి ప్రచారంలో పదేపదే చెప్పారు.
సీఎంతోపాటు పీసీసీ పెద్దలకు సైతం ఇలాగే గొప్పలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. అందుకు భిన్నంగా 27 స్థానాలతోనే ఆగిపోయారు. ఇది మ్యాజిక్ ఫిగర్ 25కు రెండే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో మంత్రి శుక్రవారం రాత్రి నుంచే స్వతంత్రులతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లపై గురిపెట్టారు. చైర్మన్ ఎన్నిక నాటికి కనీసం 30 మంది కార్పొరేటర్లకు తగ్గకుండా మరో ముగ్గురునలుగురిని లాక్కురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసిం ది. ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన ఇద్దరిని, ఒక స్వతంత్ర అభ్యర్థిని ఒప్పించి శిబిరానికి తరలించినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ముందే పబ్లిసిటీ చేసుకున్న స్థానాలు రాకపోవడంతో మంత్రి ఇబ్బంది పడుతున్నారన్నది నిజం.
నేడు తేలనున్న చైర్మన్ అభ్యర్థులు
హాలియాలో చైర్మన్ రేస్‌లో చింతల చంద్రారెడ్డితో పాటు కుందూరు వెంకట్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఇందులో చంద్రారెడ్డికి ముందే హామీ ఇచ్చినట్లు సమాచారం. వైస్ చైర్మన్ యాదవ సామాజిక వర్గం నుంచి పిల్లి చంద్రకళాఆంజనేయులు, గౌని రాజారమేశ్ పోటీ పడుతుండగా ఇప్పటి వరకు స్పష్టత లేదు. నందికొండలో చైర్మన్ పీఠం కోసం మానస స్వర్ణ, మందా గౌతమి, ఐదో వార్డు కౌన్సిలర్ పాయర్థ బాబురావు పోటీ పడుతున్నట్లు తెలిసింది. వీరిలో ఒకరు ఫైనల్ కావచ్చని, వైస్ చైర్మన్‌గా మాత్రం రాజా ప్రసాద్ ఉండొచ్చని తెలిసింది. దేవరకొండలో చైర్ పర్సన్‌గా అభ్యర్థిగా ఉన్న శైలజ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్‌పై మాత్రం రేపటి వరకు స్పష్టత రావొచ్చని సమాచారం. చండూరులో చైర్మన్‌గా కోడి శ్రీనివాసులు ఫైనల్ అయినా వైస్ చైర్మన్ తేలాల్సి ఉంది.
వైస్ చైర్మన్ కోసం బూతరాజు దశరత, సీపీఐ నుంచి జిల్లా ధనమ్మ పోటీ పడుతున్నారు. చిట్యాలలో చైర్మన్‌గా పందిరి గీతారమేశ్ దాదాపు ఫైనల్ కాగా వైస్ చైర్మన్‌పై పీఠముడి కొనసాగుతోంది. గుండబోయిని శ్రీలతాసైదులు, కె.మోహన్, ఏర్పుల పరమేశ్ రేసులో ఉన్నారు. మిర్యాలగూడలో చైర్ పర్సన్‌పై స్పష్టత లేదు. ముందుగా అనుకున్న ప్రకారమైతే నూకల కవితావేణుగోపాల్రెడ్డి చైర్మన్ కావాలి. ఫలితాల అనంతరం మరికొందరు తీవ్రంగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. గుడిపాటి శిరీషానవీన్, చిలుకూరి సంధ్యాబాలు, మిట్టపల్లి శ్రీదేవి కూడా చైర్మన్ పీఠం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. రెడ్డి లేకపోతే వైశ్య సామాజిక వర్గానికి దక్కవచ్చని తెలుస్తోంది. చైర్మన్ తేలితేనే వైస్ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రానుంది. ఆదివారం రాత్రి వరకు దాదాపు అన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఫైనల్ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.