
నేటి నుంచి ఆరో విడుత చేప పిల్లల పంపిణీ
భువనగిరిలో ప్రారంభించనున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి
యాద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3.15కోట్ల పిల్లల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు
8,929 కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి
సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్యకారులను ఆదుకుని అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కారు ఆరో విడుత చేప పిల్లల పంపిణీకి సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాదీ నీటి వసతి ఉన్న ప్రతి చెరువులోనూ చేప పిల్లలను వదిలేందుకు మత్స్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. భువనగిరి పెద్దచెరువులో బుధవారం చేప పిల్లలను విడుదల చేసి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. యాదాద్రి జిల్లావ్యాప్తంగా 1,204 చెరువులను ఎంపిక చేయగా, 3.15 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిం చారు. తద్వారా 8,929 కుటుంబాలు ఏడాదంతా ఉపాధి లభించనున్నది.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నది. అందులో భాగంగా ఏటా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నది. 2018-19 సంవత్సరంలో 99లక్షల చేపపిల్లలు, 2019-20 సంవత్సరంలో 2.15కోట్ల చేపపిల్లలు, 2020-21 సంవత్సరంలో 2.20కోట్ల చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారులు చెరువుల్లో వదలగా ఈ ఏడాది 3.15కోట్ల చేప పిల్లలను వదిలేందుకు సర్వం సిద్ధం చేశారు. 80-100 ఎంఎం సైజు గల 1.14కోట్ల చేప పిల్లలు, 35-40 ఎంఎం సైజు గల 2.01కోట్ల చేప పిల్లలను వదలడం కోసం రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నారు. నీలి విప్లవం పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా మాదిరిగా ఈసారి సైతం చేప పిల్లలను పూర్తి సబ్సిడీపై మత్స్యకార్మికులకు అందిస్తుండడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
అన్ని చెరువుల్లో…
యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు కలిపి 1,204 వరకు ఉన్నాయి. వీటిలో మత్స్యశాఖ ఆధీనంలో 181 చెరువులు, మిగతావి గ్రామపంచాయతీల ఆధీనంలో ఉన్నాయి. మూసీతోపాటు గతేడాది నుంచి జిల్లాకు గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తుండడంతో ఇప్పటికే చాలావరకు చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. చేపపిల్లలు పెరిగేందుకు నీటి లభ్యత ఉన్న అన్ని చెరువుల్లో గతేడాది మాదిరిగానే చేప పిల్లలను వదిలేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 127 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 8,929 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది 435 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలగా రికార్డు స్థాయిలో 1.13కోట్ల కిలోల ఉత్పత్తి వచ్చింది. ఒక్కో సభ్యుడికి రూ.63 వేల చొప్పున లబ్ధి కలిగింది. ఈ లెక్కన గతేడాదిలో రూ.56 కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్యకార్మికులు అందిపుచ్చుకున్నారు. వీరితోపాటు గ్రామ పంచాయతీ చెరువుల పరిధిలో ఉన్న నాన్ సొసైటీ సభ్యులకు సైతం ప్రతి యేటా నీలి విప్లవం ఫలితాలు అందుతున్నాయి. నీలి విప్లవంతో చేపలు సమృద్ధిగా పల్లె, పట్టణ వాసులకు దొరుకుతున్నాయి.
నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా..
జిల్లాలో చేపల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం లాంఛనంగా జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నారు. భువనగిరి పట్టణ శివారులోని పెద్ద చెరువులో ఉదయం 10.30 గంటలకు చేప పిల్లలను వదలనున్నారు. ఈ చెరువులో ఈ ఏడాది 2.25లక్షల చేప పిల్లలను వదలాలని సంకల్పించారు. ఇందులో 78,750 కట్ల, మరో 78,750 రోహు చేపపిల్లలను, 67,500 ఇతర రకాల చేపపిల్లలను వదలనున్నారు.