యాదాద్రి, అక్టోబర్ 5 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతుబిడ్డల చదువులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల రుణాలు అందజేసి ఆర్థిక భరోసా కల్పించినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి రైతువేదిక భవనంలో నల్లగొండ డీసీసీబీ, నాబార్డు సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు నగదు లావాదేవీలపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 సహకార సంఘాలకు నాబార్టు ద్వారా రూ. 2 కోట్ల రుణాలను త్వరలో అందజేయనున్నట్లు వెల్లడించారు. వంగపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చొల్లేరు, మోటకొండూర్ గ్రామాల్లో 3 ఎకరాల్లో గోదాం, వంగపల్లిలో పెట్రోల్ బంక్, చిన్నకందుకూరు ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. పీఏసీఎస్‌కు కొనుగోళ్ల అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ ఏడాదిలో 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 8.30 శాతం వడ్డీతో దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 120 కోట్ల పంట రుణాలను అందజేశామని, అందులో ఆలేరు నియోజకవర్గంలో రూ.27 కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేవలం రూ. 50 లక్షల వరకు రుణాలు అందజేశాయని, ప్రస్తుతం రైతుకు ఎంత అవసరముంటే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలకు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. డెయిరీ ఉత్పత్తులకు రూ.కోటి రుణం అందజేస్తామని, ఇందులో బీసీలకు 25శాతం, ఎస్సీలకు 33 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. నార్ముల్ పరిధిలో 302 పాల సంఘాలుంటే ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 140 ఉన్నట్లు చెప్పారు. పౌల్ట్రీ, గొర్రెలు, పందుల పెంపకానికి 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, డీసీసీబీ సీఈఓ మదన్మోహన్, డీసీసీబీ మేనేజర్ కావ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, డైరెక్టర్ అందెం లింగయ్య యాదవ్, మదర్ డెయిరీ డైరెక్టర్లు కల్లేపల్లి శ్రీశైలం, కందాల అలివేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఆలేరు పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్, వంగపల్లి పీఏసీఎస్ డైరెక్టర్లు భిక్షంగౌడ్, యాదిరెడ్డి, అనిత తదితరులు పాల్గొన్నారు.