హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారో లేదో చెప్పాలని హైకోర్టు ఆ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ను ప్రశ్నించింది. ఈ మేరకు ఆయనతోపాటు సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్కు అత్యవసర నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిరేవులలో జూబ్లీహిల్స్-4 పేరిట నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందాన్ని ఆపేయాలన్న ఉత్తర్వులను ఉల్లంఘి స్తూ కొత్త సభ్యులకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లుగా అవకాశమిచ్చారని సొసై టీ సభ్యుడు జ్యోతిప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. కో-ఆపరేటివ్ సొసైటీల చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం సొసైటీలో స్థలాలు ఉన్నవారినే కొత్త సభ్యులగా చేర్చుకోవాలని, స్థలా లు లేని సభ్యుల సంఖ్య 10 శాతానికి మించకూడదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
మంచిరేవులలో జూబ్లీహిల్స్ ఫేజ్-4 పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆ సొసైటీ తెరతీసిందని, కొత్త సభ్యులుగా చేరేవారు రూ.5 లక్షలు చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవాలని సొసైటీ షరతు విధించిందని వివరించారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, మరో న్యాయవాది వై రామారావు వాదనలు వినిపి స్తూ.. కోర్టు ఆదేశాలను ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని, సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కొత్త సభ్యత్వాలపై ముందడుగు వేయొద్దని, ఆ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 2024 నాటి ఉత్తర్వుల జారీ అయినప్పుడు ఉన్న రిజిస్ట్రారును ఈ కేసులో ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసై టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్పై 6 వారాల్లోగా చర్యలు చేపట్టాలన్న కోర్టు ఆదేశాలపై సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్, విజయభాసర్రెడ్డి దాఖలు చేసిన ధిక్కార పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది.