హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్డులను కైవసం చేసుకొన్న బీఆర్ఎస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలను సాధించి సత్తాచాటింది. కాంగ్రెస్ అధికార, అంగ, అర్థ బలాలను ఎదిరించి గణనీయమైన స్థానాలను కైవసం చేసుకొన్నది. పటిష్టమైన క్యాడర్ బలాన్ని, పట్టణ ఓటర్లలో తనకున్న ఆదరణను మరోసారి చాటుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డుకు పోటీచేసిన బీజేపీ అభ్యర్థి మహదేవప్ప పోలింగ్‌కు ముందు ఆత్మహత్య చేసుకోవడంలో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 2,581 వార్డులకు గాను 12 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,569 వార్డు ల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో అధికార కాంగ్రెస్ 1,346 వార్డులను (52.15) గెలుచుకోగా, బీఆర్ఎస్ సుమారు 718 స్థానాలకు పైగా జయకేతనం ఎగురవేసింది.
దాదాపు 30% స్థానాలను కైవసం చేసుకొన్నది. ఇతరులు గెలిచిన స్థానాల్లోనూ బీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ టికెట్ దక్కనివారు ఎన్నికల బరిలో నిలిచి పలుచోట్ల విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100కు పైగా స్థానాలను ఒకటి నుంచి 10 ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 259 వార్డులకే పరిమితం కాగా, ఆ పార్టీతో పోల్చిచూస్తే బీఆర్ఎస్ మూడు రెట్లు ఎక్కువగా వార్డులను గెలుచుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పూర్తిస్థాయిలో పైచేయి సాధించింది. హైదరాబాద్ నగర శివారుతోపాటు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికార పార్టీతో పోటీపడి గులాబీ పార్టీ ఫలితాలు సాధించింది. జోగులాంబ జిల్లాలోని అయిజ (13), మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు (9), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి (14), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (13), సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం (14), గుమ్మడిదల (15) మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గకేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రికార్డు విజయం సాధించింది. మొత్తం 39 స్థానాలకు గానూ 27 వార్డులతో తిరుగులేని మెజారిటీతో కైవసం చేసుకున్నది. 70% స్థానాలను దక్కించుకొన్నది. ఇక్కడ కాంగ్రెస్ ఆరు స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కేవలం 5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీని వెనకి నెట్టి మొత్తంగా 30 వార్డులను గెలుచుకోవడం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
116 మున్సిపాలిటీల్లో 718 వార్డులను గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదిని బీఆర్ఎస్ నిరూపించుకున్నది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో అధికార పార్టీతో సమానంగా 8 వార్డులను గెలుచుకొని సత్తా చాటింది. హుజూర్నగర్, నేరేడుచర్ల వంటి చోట్ల కూడా ప్రతికూల పరిస్థితుల్లోనూ గణనీయమైన స్థానాలను సాధించింది. జాతీయ పార్టీ అయిన బీజేపీ కేవలం 259 వార్డులకే పరిమితం కాగా, బీఆర్ఎస్ అంతకంటే దాదాపు మూడు రెట్లు ఎకువ స్థానాలను సాధించి రాష్ట్రంలో తన స్థానం సుస్థిరమని చాటిచెప్పింది. అధికారంలో లేకపోయినా, పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ సంపాదించిన ఈ సీట్లు.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం చెకుచెదరలేదని, రాబోయే రోజుల్లో పుంజుకుంటామని బీఆర్ఎస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్నది.
మున్సిపాలిటీల సంఖ్య : 116
వార్డుల సంఖ్య : 2,582
కాంగ్రెస్ : 1,346 (52.15 శాతం)
బీఆర్ఎస్ : 718 (27.81 శాతం)
బీజేపీ : 259 (10.03 శాతం)
(ఎంఐఎం: 48, సీపీఎం: 12, బీఎస్పీ: 2, ఇతర గుర్తింపు పార్టీలు: 35, స్వతంత్రులు: 161) (9.99 శాతం)