యాదాద్రి, అక్టోబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన భక్తుల కొత్త క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి సమీపంలో హనుమంతుడి విగ్రహానికి పంచామృతాభిషేకం, సింధూరం అలంకరణ చేశారు. తమలపాకులతో అర్చన నిర్వహించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ.4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేటి నుంచి ఈ నెల 14 వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎన్. గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి కొండపై కార్యనిర్వహణాధికారి క్యాంపు కార్యాలయ అవరణలో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11వ తేదీన బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తామని, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 27,726
రూ.100 దర్శనం టిక్కెట్ 11,000
వీఐపీ దర్శనాలు –
వేద ఆశీర్వచనం 516
క్యారీబ్యాగుల విక్రయం 2,400
వ్రత పూజలు 4,000
కల్యాణకట్ట టిక్కెట్లు 5,400
ప్రసాద విక్రయం 1,75,970
వాహన పూజలు 4,300
టోల్గేట్ 720
అన్నదాన విరాళం 2,733
సువర్ణ పుష్పార్చన 52,120
యాదరుషి నిలయం 20,950
పాతగుట్ట నుంచి 11,950
ఇతర విభాగాలు 62,984