
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరద నీటికి చౌటుప్పల్ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చౌటుప్పల్‌లోని పెద్దచెరువు నిండడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, దుకాణ సముదాయాల్లో నీరు నిలువడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.
చౌటుప్పల్, ఆగస్టు 5 : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆర్డీఓ, ఎంపీడీఓ, ఆర్టీసీ బస్టాండ్, గాంధీపార్క్ వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలైన గాంధీపార్క్, రాంనగర్, విద్యానగర్ కాలనీలు జలమయమయ్యాయి. చిన్నకొండూరు చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్ లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరకుంది. అంతేకాకుండా చౌటుప్పల్ పెద్దచెరువు నిండుకొని అలుగు పోస్తుండడంతో ఆ నీరు కాలనీలకు చేరుకుంటుంది. లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సహాయక చర్యలను చేపట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందునా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైర్మన్ సూచించారు.
కాలనీల్లో చేపల వేట..
వరద నీరు పలు కాలనీలకు పోటెత్తుతుండంతో ఆ నీటిలో కొట్టుకొస్తున్న చేపలను పట్టేందుకు యువత ఆసక్తి చూపారు. పెద్ద పెద్ద చేపలను పట్టుకొని మురిసిపోయారు.
అప్రమత్తంగా ఉండాలి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి
వర్షాల పట్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని పలు లోతట్టు కాలనీలు, సర్వీస్‌రోడ్డులో పారుతున్న వరద నీటిని ఆదివారం ఆయన పరిశీలించారు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని సూచించారు. వరద నీరు కాలనీలకు వెళ్లకుండా సర్వీస్ రోడ్డు వెంట మళ్లించాలని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఆర్డీఓ సూరజ్‌కుమార్, కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి ఉన్నారు.