
కోలాహలంగా ఆలయ పురవీధులు
యాదాద్రీశుడికి నిజాభిషేకంతో ఆరాధనలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.
ఆదివారం సెలవుతోపాటు శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్‌రోడ్డు భక్తులతో నిండిపోయాయి.
యాదాద్రి, సెప్టెంబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుతోపాటు శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్‌రోడ్డు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్మ దర్శనం, వీఐపీ దర్శన క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులు దీరారు. ప్రసాద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉన్నారు. హోటల్స్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటాలాడాయి. దర్శనానికి 4నుంచి 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ఉదయం నుంచి భక్తుల రాక..
ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్‌రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్ సిటీ, ఘాట్ రోడ్డు, రింగురోడ్డు కార్లతో నిండిపోయింది. కొండకింద చెక్‌పోస్టు వద్ద ఘాట్‌రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. శ్రావణమాసం ముగుస్తుండడంతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడానికి భక్తులు భారీగా వచ్చారు. యాదాద్రి కొండకింద ఉన్న పాత గోశాల వద్ద వ్రత మండపం, పాతగుట్టలోని వత్ర మండపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిజాభిషేకంతో ఆరాధనలు
యాదాద్రీశుడి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటలకు మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.29,96,634 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.