నర్సమ్మ : నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు మల్లేశ్ భువనగిరి దగ్గర అనంతారంలో మేస్త్రీగా పనిచేస్తున్నడు. చిన్నోడు నగేశ్ ఇంటి దగ్గరనే వెల్డింగ్ పనిచేస్కుంటున్నడు.
గౌరీశంకర్ : పది లక్షలతో ఏం
చేయాలనుకుంటున్నవ్?
నగేశ్ : మా అన్నకు పది లక్షలు, నాకు పది లక్షలు వచ్చినయ్. అన్న మేస్త్రీకి సంబంధించిన సామాను కొంటున్నడు. ఎస్ఎస్ ట్యాంకర్ల తయారీకి ఉన్న డిమాండ్‌తో ఊర్లనే చిన్నపాటి పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటున్న. నెలకు ఖర్చులు పోను
రూ.40వేలు సంపాదించడంతోపాటు పది, పదిహేను మందికి ఉపాధి చూపించగల్గుత.
గౌరీశంకర్ : మంచి ఆలోచన.
చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలతో టైఅప్ అయితే నీ బిజినెస్ బాగా నడుస్తది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తుర్కపల్లి :చరిత్రాత్మక దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి నుంచే నాంది పలికారు. దళితుల దిశదశను మార్చే మహత్తరమైన పథకం కార్యాచరణపై మేథావులతో లోతైన విశ్లేషణలు చేసిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కార్యరూపంలోకి తెచ్చేందుకు నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 4న దత్తత గ్రామం వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా ఊహించని విధంగా ఇక్కడి నుంచే దళిత బంధును లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఊరివాడిలా దళిత వాడల్లో తిరిగి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరించి సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. అనంతరం దళిత కుటుంబాలతో నిర్వహించిన ముఖాముఖిలో దళిత బంధును వాసాలమర్రి నుంచే మొదలు పెడుతున్నట్లు ప్రకటించడంతోపాటు గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. రేపే మీ అకౌంట్లలో రూ.10లక్షల నిధులు జమ అవుతాయని చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు ఆ మరునాడే ప్రభుత్వం రూ.7.60కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90లక్షల చొప్పున డబ్బులను జమ చేసింది. లబ్ధిపొందుతున్న కుటుంబాలు ఎంచుకున్న యూనిట్లపై క్షేత్రస్థాయి పర్యటనలతో అధికారులు అవగాహన కల్పించారు. దళితులు చైతన్యం పొంది ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ప్రొఫెసర్ల బృందం ఆదివారం వాసాలమర్రిలో పర్యటించింది.
ఇంటింటికీ వెళ్లి.. అప్యాయంగా పలుకరించి..
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, కవి, రచయిత జూలూరి గౌరీ శంకర్‌తోపాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జె.దేవిప్రసాద్, ఎస్ఆర్టీఐ డైరెక్టర్ కిశోర్, స్వామి రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్‌రెడ్డి, ప్రముఖ చరిత్రకారుడు అడప సత్యనారాయణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అంజిరెడ్డితో కూడిన 16 మంది సభ్యుల బృందం వాసాలమర్రిలో పర్యటించింది. దళిత వాడల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి అప్యాయంగా పలుకరించడంతోపాటు గుణాత్మక మార్పు దిశగా వారు వేస్తున్న తొలి అడుగును ఆసాంతం పరిశీలించారు. మహాత్మాగాంధీ, నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, రిసెర్చ్ స్కాలర్స్ ఈ బృందంలో ఉండగా.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్, స్థానిక అంగన్వాడీ సిబ్బంది, స్థానిక సంస్థల సిబ్బంది ప్రొఫెసర్ల అధ్యయనానికి తమవంతు సహకారం అందించారు. దళిత కుటుంబాలు ఎంచుకున్న యూనిట్లు, అందులో వారు పొందిన నైపుణ్యత తదితర అంశాలపై లబ్ధిపొందుతున్న కుటుంబాలతో కూలంకషంగా చర్చించారు. దళిత బంధు పథకంతో వారిలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రొఫెసర్ల బృందం ఆశ్చర్యపోయింది. చాలామంది లబ్ధిదారులు వ్యవసాయ అనుబంధ వృత్తులకు సంబంధించిన యూనిట్లను ఎంచుకోగా.. యువకులు ఆటోల వంటి యూనిట్లను ఎంచుకుని ఉపాధి పొందనున్నట్లు వివరించారు. ఎప్పుడూ చూడని రూ.10లక్షలను కండ్ల చూడబోతున్నామని.. ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటామని పలువురు దళితులు పేర్కొన్నారు. దళితులను లక్షాధికారులను చేసిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గ్రామ చావడి దగ్గర నిర్వహించిన దళితబంధు లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ వాసాలమర్రిలో విజయవంతమయ్యే దళితబంధు రేపటి భారతావనికి పాఠ్యాంశంగా, ఆచరణ యోగ్య పథకంగా వర్థిల్లుతుందని కొనియాడారు. అధ్యయన బృందంలో ఉస్మానియా తెలుగుశాఖ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు, ప్రొఫెసర్లు బండి శ్రీనివాస్, జి.రాము, ఎస్.కిశోర్, నల్లగొండ ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకం జయప్రకాశ్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్.మధు, డాక్టర్ పి.రామకృష్ణ, డాక్టర్ ఎండీ.షరీఫ్, డాక్టర్ షహాబాద్, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్ ఉన్నారు.