
దేశవ్యాప్తంగా అమలుకు కృషి
కేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్
రామన్నపేట, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లి దేశమంతా అమలు చేసేలా చూస్తామని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామంలో నిర్మించిన పల్లెప్రగతి వనం, రైతువేదిక, వైకుంఠధామం, గ్రామనర్సరీ, డంపింగ్ యార్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనను చూసి అభినందించారు. అనంతరం రైతు వేదికలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పారిశుధ్యం నిర్వహణ, అభివృద్ధి పనులపై సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డిని అభినందించారు. వెల్లంకి గ్రామాన్ని జాతీయ పురస్కారానికి ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేస్తూ స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో గ్రామ నర్సరీలు, హరితహారం కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. పేదలకు మేలు కలిగే పనుల విషయంలో రాజకీయాలకు తావులేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పంచాయతీరాజ్ సహాయ కమిషనర్లు రామారావు, జాన్‌వెస్లీ, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ మందడి ఉందర్రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, ఏపీఓ వెంకన్న, ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడి సేవలో
కేంద్ర మంత్రి
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రోడ్ల అభివృద్ధికి
సహకరించాలని వినతి
వలిగొండ మండలంలోని గుర్నాథ్‌పల్లి, అరూరు నుంచి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కొండ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌కు బీజేపీ మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎస్.లింగోటం గ్రామంలో మంత్రిని కలిసి మండలంలోని గ్రామీణ రోడ్ల పరిస్థితిని వివరించారు. వలిగొండలో పూలమాలతో మంత్రిని సన్మానించారు. నాయకులు సత్తయ్య, లింగస్వామి, కృష్ణ, అనిల్, శ్రీనివాస్, మత్స్యగిరి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి
కేంద్రం పెద్దపీట
చౌటుప్పల్ రూరల్ : గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మండలంలోని ఎస్.లింగోటం, పంతంగి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా లింగోటంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను ప్రగతి పథంలోకి తీసుకెళ్తే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పల్లెప్రగతి, పకృతి వనాలు, వైకుంఠాధామాలు బాగున్నాయన్నారు. గ్రామ పంచాయతీలను ఉత్తమంగా తీర్చిదిద్దితే ప్రధానమంత్రి చేతులమీదుగా అవార్డులు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచులు ఆకుల సునీత, బాతరాజు సత్యం పాల్గొన్నారు.