
తీరొక్క పువ్వుల్లా బతుకమ్మ చీరెలు
26 డిజైన్లు.. 816 రంగుల్లో తయారీ
జిల్లావ్యాప్తంగా 2.80 లక్షల మంది అర్హులు
ఇప్పటికే జిల్లాకు చేరుకున్నవి 83 వేల చీరెలు
ఆడబిడ్డలకు పండుగ కానుకగా అందిస్తున్న సీఎం కేసీఆర్
త్వరలోనే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
ఎక్కడికెన్ని చీరెలు వచ్చాయంటే..
సెంటర్ లక్ష్యం వచ్చినవి
భువనగిరి లక్ష 36వేలు
చౌటుప్పల్ 80వేలు 25వేలు
ఆలేరు 50వేలు 22వేలు
మోత్కూరు 50వేలు –
మొత్తం 2.80లక్షలు 83వేలు
యావత్ తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అతివలు అత్యంత ఇష్టంగా జరుపుకొనే 9 రోజుల వేడుకకు ఎంతో ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పండుగ పూట ఆడబిడ్డలకు సర్కారు సారెను అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి యేడు మాదిరిగానే ఈసారి కూడా బతుకమ్మ చీరెల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 2.80 లక్షల
మంది అర్హులు ఉండగా, ఇప్పటికే 83 వేల చీరెలు జిల్లాకు చేరాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గోదాముల్లో వాటిని భద్రపర్చారు. మొత్తం 816 రంగులు.. 26 డిజైన్లలో వచ్చిన చీరెలను.. రేషన్ కార్డులో 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ అందించేందుకు
పౌర సరఫరాల శాఖ జాబితాను సిద్ధం చేసింది. మిగతా చీరెలు వచ్చిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో జరుపుకునే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకునేలా తెలంగాణ ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు ప్రతి ఆడబిడ్డకు సారెగా చీరెను అందించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ప్రతి యేటా దసరాకు ముందుగానే బతుకమ్మ చీరెలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఆడబిడ్డలకు ఆనందోత్సాహాల నడుమ సంతోషంగా వేడుకలను జరుపుకొనేలా చీరెలను కానుకగా ఇవ్వనుంది. విభిన్న డిజైన్లలో రకరకాల రంగులతో అందంగా, నాణ్యతగా ఉండేలా సిరిసిల్ల కార్మికులతో ప్రభుత్వం నేయించింది. ప్రతి మహిళా మెచ్చేలా.. నచ్చేలా నాణ్యమైన వస్ర్తాలతో ప్రభుత్వం చీరెలను నేయించిందని అధికారులు చెబుతున్నారు.
2.80 లక్షల చీరెల పంపిణీకి ఏర్పాట్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,19,739 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. 18 ఏళ్ల వయస్సు నిండిన వారు 2.80 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు అర్హుల జాబితాను మండలాల వారీగా గుర్తించారు. సిరిసిల్లలో ఉత్పత్తి పూర్తయిన చీరెలను ఎప్పటికప్పుడు టెస్కో సేకరిస్తుండగా.. ఇప్పటికే 83 వేల చీరెలు యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరాయి. మిగిలిన చీరెలు సైతం మరి కొద్దిరోజుల్లోనే రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు చేరిన చీరెలను భువనగిరి, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గోదాముల్లో భద్రపర్చారు. బతుకమ్మ చీరెలను అన్ని శాఖలు సమన్వయంతో పంపిణీ చేసేలా చేనేత జౌళి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధ్ది, చేనేత జౌళి శాఖలు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో ఎంపీడీఓ, తాసీల్దార్, గ్రామ స్థాయిలో పలు శాఖల సిబ్బంది సహకారంతో ఈ చీరెలను పకడ్బందీగా పంపిణీ చేసేలా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. చీరెల పంపిణీని రేషన్ దుకాణాల ద్వారా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
అర్హులందరికీ చీరెలు అందేలా చర్యలు
18 ఏళ్లు నిండిన మహిళలు జాబితాను పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ఈ ప్రకారంగా ప్రభుత్వం చీరెలను జిల్లాకు పంపుతున్నది. ఇప్పటివరకు 83వేల వరకు చీరెలు జిల్లాకు వచ్చాయి. మిగిలిన చీరెలు త్వరలోనే రానున్నాయి. కొవిడ్ నిబంధనలకనుగుణంగా రేషన్ దుకాణాల ద్వారా చీరలను పంపిణీ చేయనున్నాం. అన్ని శాఖల సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం.