
ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నలుగురు ఎంపిక
చౌటుప్పల్ రూరల్, తిరుమలగిరి, హాలియా, సెప్టెంబర్ 3 : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో అందించనున్న అవార్డులకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇద్దరు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు సి.వెంకట హరికృష్ణ, ఎస్జీటీ క్యాటగిరీలో చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్.రాజిరెడ్డి, స్పెషల్ క్యాటగిరీలో నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలానికి చెందిన చిలుకాపూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదయ్య, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కసిరెడ్డి అశోక్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో అవార్డు అందుకోనున్నారు.
ప్రయోగాత్మక బోధన..
తూఫ్రాన్‌పేట జడ్పీహెచ్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు చింతల వెంకట హరికృష్ణ
పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా వివరిస్తూ విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధన అందిస్తున్నారు. మూడేండ్లుగా సొంత ఖర్చులతో బోధన ఉపకరణాలను సమకూర్చుకుని, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారు.
మొక్కల మాస్టారు..
తాళ్లసింగారం పైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు రేగేట్టె రాజిరెడ్డి పాఠశాలను హరితవనంగా తీర్చిదిద్దారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడమే కాకుండా హరితహారంపై చైతన్యం పెంచేలా వ్యాసాలు, పద్యాలు రాశారు. 10 ఏండ్లుగా ఏ పాఠశాలలో పని చేస్తున్నా మొక్కలు నాటడడం ఆయన ప్రత్యేకత.
వీధుల్లోనూ విద్యా బోధన..
తిరుమలగిరి (సాగర్) మండలం చిలుకాపూర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న కట్టెబోయిన సైదులు స్కూల్ బలోపేతానికి విశేష కృషి చేశారు. గ్రామంలో ఉన్న విద్యార్థులంతా నూటికి నూరు శాతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే చూస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కోచింగ్ సెంటర్లకు దీటుగా ఏటా 10 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. దాతల సహకారంతో రూ.లక్షన్నరతో పాఠశాలకు ప్రహరీ ఏర్పాటుచేశారు. పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాలు ఇప్పిస్తుంటారు. కరోనా సమయంలో ఆన్లైన్ చదువులకు దూరమైన విద్యార్థుల కోసం వీధుల్లో, పిల్లలు ఆడుకునే ప్రదేశంలో సబ్జెక్టుల వారీగా తెలుగు, ఆంగ్లం వర్ణమాల, ఎక్కాలు వంటి పెయింటింగ్ రూపంలో వేయించి బోధనను చేరువ చేశారు.