యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయం పచ్చదనంతో కొత్త శోభ సంతరించుకుంది. ఆలయ
పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వైడీటీఏ అధికారులు మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిచ్చారు. కొండ చుట్టూ దాదాపు 108 రకాల మొక్కలు నాటగా ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూలు, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు, రాశి, నక్షత్ర వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
యాదాద్రి, అక్టోబర్ 2 : ఒకవైపు కృష్ణశిలల కమనీయత.. మరోవైపు ఆహ్లాదాన్ని పంచే వృక్ష సంపద.. వెరసి యాదాద్రీశుడి దివ్యక్షేత్రం మహాద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రధాన గాలిగోపురం(వైకుంఠ ద్వారం) మొదలు యాదాద్రి ప్రధానాలయం వరకు ఎక్కడ చూసినా పచ్చని హారాలతో వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు జరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ప్రకారం ఆలయం చుట్టూ పచ్చదనం పనులు తుదిదశకు చేరాయి. కొండ చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూలు, ఔషధ మొక్కలు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. కొండ చుట్టూ దాదాపు 108 రకాల మొక్కలు నాటారు. హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం, ఆధ్యాత్మిక, ఆహ్లాదాల మేళవింపుగా తీర్చిదిద్దారు. ఉత్తర దిశగా నృసింహుడి జన్మ నక్షత్రం, స్వాతి, తులరాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలను, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిధున రాశి ప్రకారం కదంబ మొక్కలను నాటారు. హరిహరుల జన్మ నక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్యలో అర్చనలకు వినియోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెల్లివిరిసే విధంగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దారు. ఉత్తర ప్రహరీకి పక్కన దేవుడి పూజకు వినియోగించే మినీ నందివర్ధనం మొక్కలను నాటారు. సంవత్సరం పొడవునా పూసే ఈ మొక్కలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు పక్కన గిరిప్రదక్షిణ రోడ్డు వనంలో వివిధ రకాల నక్షత్ర మొక్కలను నాటారు. ఆలయ విస్తరణలో భాగంగా కొండ చుట్టూ రానున్న ఆరులైన్ల రింగురోడ్డు రహదారిలో 25 అడుగుల ఎత్తు మొక్కలను నాటారు. రహదారి చుట్టూ సర్కిళ్ల వద్ద వివిధ రకాల రంగుల మొక్కలను నాటి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలు 7,400, చిన్న చిన్న మొక్కలు సుమారు 20 వేలకు పైగా నాటారు. వీటితోపాటు కొండ చుట్టూ 20 వేల మొక్కలు నాటగా, ఇందులో సంపంగి, మాగని, పొన్న చెట్టు, నాగావళి, విరజాజి, సన్నజాజి, నైట్ క్వీన్, ఏక బిల్వం, బిల్వం, రావి, మర్రి, వేప, జువ్వి, సబూమి, మవోడియా, బిగ్నోనియా సహా వివిధ రకాల పూలమొక్కలు, సువాసనలు వెదజల్లే మొక్కలు ఉన్నాయి. కొండ చుట్టూ సుమారు 10ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు పక్కనే నక్షత్ర వనం, రాశి వనం ఏర్పాటు చేశారు. ఇందులో 27 నక్షత్రాలు, 12 రాశులకు సంబంధించిన మొక్కలను నాటారు. కొండ దక్షిణ భాగంలో మినీ పార్క్‌లు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. వైకుంఠ ద్వారం పక్కనే మినీ పార్క్‌లో భక్తులు వెళ్లేందుకు చక్కటి మెట్లు ఆకట్టుకోనున్నాయి. స్వామివారి దర్శనానంతరం భక్తులు సేదదీరేందుకు గార్డెనింగ్ చేపట్టారు.