యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు. కొండపైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండకింద భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.6,52,343 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
నేడు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ రాక
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
విస్తరణ పనులు పరిశీలించిన వైటీడీఏ వైస్ చైర్మన్
యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పూర్తయిన నేపథ్యంలో కొండతోపాటు కింది భాగంలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు గురువారం పరిశీలించారు. మొదటగా యాదాద్రీశుడిని దర్శించుకున్న ఆయన.. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రధానంగా వైకుంఠద్వారం వద్ద ప్రధాన రోడ్డు, భక్తులు కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ రోడ్లు, గండిచెరువు సుందరీకరణ, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం పనుల తీరుపై కొండపైన హరితహోటల్లో సమీక్షించారు. కొద్దిరోజులుగా కురిసిన వర్షాలతో పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం వైటీడీఏ అధికారులు పనుల్లో వేగం పెంచినట్లు వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వివరించారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 34,954
రూ.100 దర్శనం టిక్కెట్ 14,500
వేద ఆశీర్వచనం 3,612
ప్రచారశాఖ 200
క్యారీబ్యాగుల విక్రయం 1,650
వ్రత పూజలు 2,000
కల్యాణకట్ట టిక్కెట్లు 7,800
ప్రసాద విక్రయం 2,17,000
వాహన పూజలు 2,200
అన్నదాన విరాళం 7,298
సువర్ణ పుష్పార్చన 33,355
యాదరుషి నిలయం 10,000
పాతగుట్ట నుంచి 3,355
ఇతర విభాగాలు 3,13,514