ఈ సీజన్లో జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా సాగైన పంట పత్తి. 56,506 మంది రైతులు 1,24,172 ఎకరాల్లో వేశారు. 86,141 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఆ పంట చేతికొచ్చే నాటికి మార్కెట్లో రైతులు ఇబ్బందులు పడకుండా మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నది. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, వలిగొండ వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని 16 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. దళారుల దందాకు చెక్ పెట్టి, సీసీఐ ద్వారా పక్కాగా కొనుగోళ్లు జరిపించి, రైతులకు అండగా నిలిచేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి గురువారం వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్, రవాణా, అగ్నిమాపక, సీసీఐ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్ ప్రారంభం నుంచే కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లా రైతాంగం రికార్డు స్థాయిలో 2,76,659 ఎకరాల్లో వరి సాగు చేయగా.. తర్వాత 1,22,864 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
దళారీ దందాకు చెక్ పెట్టేలా..
విత్తనం నాటినప్పటి నుంచి కొనుగోళ్ల వరకు టెన్షన్ టెన్షన్‌తో గడిపే రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు భరోసాను నింపుతున్నాయి. గతేడాది నుంచి కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రతి సీజన్లోనూ రైతులు కొనుగోళ్ల సందర్భంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ జిల్లావ్యాప్తంగా సాగు చేసిన పత్తి పంట వివరాలను సేకరించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు పేరు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్లతోపాటు ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలను సాగు చేశారు తదితర వివరాలన్నింటినీ సేకరించి ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం ఆ సాఫ్ట్‌వేర్‌ను వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖకు అందజేసింది. దీనివల్ల చాలావరకు అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లను, ధ్రువీకరణ పత్రాలను అందించనున్నారు. దీంతో రోజుల తరబడిగా నిరీక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు.
మూడు వారాల్లో కార్యాచరణ పూర్తి చేయాలి : కలెక్టర్
2020-21 సంవత్సరానికి సంబంధించి పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లకు మూడు వారాల్లోగా కార్యాచరణను రూపొందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్, రవాణా, ఫైర్, సీసీఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 16 కాటన్ జిన్నింగ్ మిల్లులకు కొనుగోళ్లు జరిపేలా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ డిఫ్యూటీ డైరెక్టర్ సబిత, సీసీఐ అధికారి కేవీ కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ నీలిమ, భువనగిరి ఏఎంసీ కార్యదర్శి రంజిత్ రావు, వివిధ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.