
చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేత కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. థ్రిఫ్ట్(నేతన్నకు చేయూత), చేనేత మిత్ర వంటి వివిధ పథకాలతో సాయం అందించి ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. గత ఏడాది కరోనా పరిస్థితుల్లో ‘నేతన్నకు చేయూత’ కింద అందించిన నగదు కొండంత అండగా నిలిచింది. ఈ పథకానికి వచ్చిన విశేషాదరణను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు నిర్ణయించుకున్నది. ఈ మేరకు రూ.30కోట్లను విడుదల చేసింది. నేతన్నకు చేయూత పథకంలో ప్రతి కార్మికుడికి లబ్ధి కలిగించేందుకు ఇటీవల ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. నేటితో ఈ గడువు ముగియనుండగా, పదిహేను రోజుల్లో దరఖాస్తుల పరిశీలన, ఖాతాల్లో పొదుపు నగదు జమ చేయడం వంటి ప్రక్రియలను పూర్తి చేసే దిశగా చేనేత, జౌళిశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తదనంతరం ప్రభుత్వ వాటా సొమ్మును సంబంధిత కార్మికుడి ఖాతాలో జమ చేయనున్నారు. జిల్లాలో ఈ ఏడాది నేతన్నకు చేయూత పథకంలో 15 వేలకుపైగా కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. మరమగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి.. వారి మనుగడే ప్రశ్నార్థకమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేతకు పూర్వవైభవం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొండంత భరోసానిస్తూ వస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనప్పటికీ ప్రభుత్వం అందించిన చేయూతతో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయి. 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా.. ప్రతినెలా 8శాతం పొదుపు చేసిన కార్మికుడి ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేళ్ల వ్యవధి ముగిశాక అందజేస్తోంది. గత ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడువును సడలించి మందుగానే తమ మొత్తాలను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. ఈ పథకం ఎంతో మంది కార్మికుల కుటుంబాలకు సాంత్వన చేకూర్చడంతో ఈ ఏడాది తిరిగి పథకాన్ని కొనసాగించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం తమ వాటా కింద రూ.30కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని త్వరలోనే ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నది.
ప్రత్యేక క్యాంపులతో అర్హుల గుర్తింపు..
జిల్లాలో 20వేల వరకు చేనేత కుటుంబాలు మగ్గాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. చేనేత, జౌళి శాఖ అధికారుల సర్వే ప్రకారం.. జియో ట్యాగింగ్‌లో 5,464 మగ్గాలు ఉండగా, గత ఏడాది 3,100 వీవర్స్తోపాటు ఇతర కార్మికులు కలుపుకుని 5,542 మంది నేతన్నకు చేయూత పథకంలో లబ్ధి పొందారు. ఇప్పటివరకు 50శాతం మందే ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధిపొందుతున్నారు. వివిధ కారణాలతో ఈ పథకంలో లబ్ధిదారులకు చేరలేకపోయారు. ఫలితంగా ప్రభుత్వం అందించే సాయాన్ని ఎన్నో కుటుంబాలు పొందలేకపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా చేనేత, జౌళి శాఖ ఇటీవల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను నిర్వహించింది. జియోట్యాగ్ కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు ఎప్పటికప్పుడు గుర్తించి ఈ పథకంలో లబ్ధిపొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటుండటంతో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఈసారి డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్స్, వైండర్స్ తదితర చేనేత అనుబంధ పనివారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంతో కొత్తగా పదివేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీవర్స్ నెలకు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.1200 వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీవర్స్ సహాయకురాలు రూ.800, అనుబంధ కార్మికుడు రూ.600 లెక్కన పొదుపు చేయవచ్చు. ఒక మగ్గంపై ముగ్గురికి అవకాశం ఉండటంతో జిల్లాలో ఈసారి మొత్తంగా 15వేలకు పైగా కార్మికులు నేతన్నకు చేయూత పథకంలో లబ్ధిపొందే అవకాశం ఉన్నది.
ఆదుకుంటున్న ‘చేనేత మిత్ర’ పథకం
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40శాతం సబ్సిడీ ఇచ్చి ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇందులో 35శాతం కార్మికులకు చెల్లిస్తుండగా.. మిగతా 5శాతం సబ్సిడీని సంఘానికి.. లేకుంటే గ్రూపు లీడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌డీసీ) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పని చేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తున్నది. జనగామ, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6వేల మంది రూ.3.86కోట్ల వరకు లబ్ధిపొందారు. సిల్కుకు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్‌పై 12సార్లు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఈ లెక్కన మగ్గంనేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ.1-2వేల వరకు లబ్ధి పొందవచ్చు. జిల్లాలో 1,691 బిల్లులకు గాను రూ.4.11కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 1,601 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాలో రూ.3.86కోట్లను జమ చేసింది. ఇంకా మిగిలిపోయిన కొద్దిపాటి చెల్లింపులను త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
నేతన్నకు చేయూతతో భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం
కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తున్న ‘నేతన్నకు చేయూత’ పథకం చేనేత కార్మిక కుటుంబాలకు గొప్ప మేలును చేకూర్చుతున్నది. నూరుశాతం మంది కార్మికులకు ఈ పథకంలో లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేక క్యాంపులతో అర్హులను ఎంపిక చేసి ఈ నెలాఖరులోపుగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.