వెల్గటూర్, జనవరి 13: అతివలు అన్నిరంగాల్లో ముందుండి ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో చితికిపోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తుందని చెప్పారు. గురువారం ఆయన ధర్మపురి పట్టణం, వెల్గటూర్‌లో పర్యటించారు. ధర్మపురిలో పలు వార్డులకు వెళ్లి కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ధర్మపురి ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో, వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టార్ మహిళా మండలి నేతృత్వంలో 3 నెలలు కుట్టు మిషన్ శిక్షణ పొందిన 179 మంది మహిళలకు కుట్టు మిషన్లతో పాటు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వెల్గటూర్‌లో 20 మంది లబ్ధిదారులకు రూ. 20 లక్షల 2వేల 320 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పరాయి పాలనలో చితికిపోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని చెప్పారు. బ్యాంకు లింకేజీ లేకుండా దళితబంధు వర్తింపజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని 2 వేల దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. దళితులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, సర్పంచులు మేర్గు మురళి, బొడకుంటి రమేశ్, గంగుల నగేశ్, పొన్నం స్వరూప తిరుపతి, నక్క మౌనికా రవితేజ, పాక్స్ చైర్మన్లు రాంరెడ్డి, రత్నాకర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జగన్, నాయకులు రాంచందర్‌గౌడ్, మనీశ్, స్టార్ మహిళ మండలి అధ్యక్షురాలు ఫాతీమా, తదితరులు ఉన్నారు.