హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25 : ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మారెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ద్వారా పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో నిరుద్యోగ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకంలో భాగంగా ఈజీఎంఎం సంస్థ ను ఏర్పాటు చేసి, మెగా జాబ్‌మేళాను నిర్వహించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సభ్యుల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యమన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. గ్రామీణ యువత వాటిని అందుకోవడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ అందించడమే ఆశయంగా ఈ సంస్థ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జాబ్‌మేళాలో మొత్తం 34 కంపెనీలు పాల్గొన్నాయని, ఈ కంపెనీల ద్వారా 8,124 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఫార్మా, హాస్పిటల్, సెక్యూరిటీ, సేల్స్, మారెటింగ్ ఇండస్ట్రియల్, ఫైనాన్స్ ఇలా అనేక రంగాల్లో ఉద్యోగావకాశం కల్పిస్తారని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రం లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 1.35లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంకా ఆయా శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను గుర్తించి, ఇప్పటికే 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఐటీ రంగంలో బెంగళూరుకు దీటుగా మన హైదరాబాద్ ఎదిగిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ రంగం, వివిధ కంపెనీలను తీసుకొచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు వచ్చాయని, ఇంకా వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెగా జాబ్‌మేళాలో పాల్గొని, ఇకడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆయా కంపెనీలకు మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.