ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఆటోలు, సెంట్రింగ్, కోళ్ల ఫారాలు.. ఇలా రూ.5కోట్ల విలువైన యూనిట్లు అందుకొని దళితబిడ్డలు మురిసిపోయారు. ఇన్నాళ్లు కూలీలుగా బతుకీడ్చిన తమను సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో ఓనర్లను చేసి జీవితాల్లో కొత్త వెలుగునింపారంటూ సంబురపడ్డారు.
సోమవారం పాలకుర్తిలోని మంత్రి కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని 50మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా అందుకొని ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తంచేశాయి. దళితుల ఆర్థికాభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయమని.. అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచించిన మహానుభావుడు కేసీఆరేనని పేర్కొన్న మంత్రి.. యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 25 : పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల కొడకండ్ల మండలాల 50మంది లబ్ధిదారులకు సోమవారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా జరిగింది. పాలకుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ఏ భాస్కర్‌రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు.
పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన 20మందికి, దేవరుప్పుల మండలం బంజర గ్రామంలో 15మందికి, కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామంలో 15మంది వారు ఎంచుకున్న ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఆటోలు, సెంట్రింగ్, కోళ్ల ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధువువని కొనియాడారు. అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచించిన మహాత్ముడు సీఎం కేసీఆరేనన్నారు. మూడేండ్లలో రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు అందజేస్తామన్నారు.
ఈ బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17వేల 700కోట్లను కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ పథకంతో దళితుల దరిద్రం పోతుందని.. వారు ఇక కూలీలు కాదు యజమానులయ్యారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గిరిజన రిజర్వేషన్ల పెంపును అడ్టుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం తెలంగాణపై సీ ఎం కేసీఆర్ పథకాలపై వివక్ష చూపుతోందన్నా రు. దళితులు దళితబంధును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని ఆకాంక్షించారు. 70ఏళ్లలో దళితులను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని కానీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్ విజయలక్ష్మి, డీపీఓ రంగాచారి, ఏపీడీ ఎండీ నూరోద్దీన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొర్నెలియస్, బీసీ వెల్ఫేర్ ఈడీ రవీందర్, ఆర్డీఓ కృష్ణవేణి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, పల్ల భార్గవి సుందర్రామిరెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ డి గాంధీనాయక్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, తీగల దయాకర్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, సర్పంచ్‌లు పోగు రాజేశ్వరి శ్రీనివాస్, బెల్లి సోమయ్య, మాలోత్ కవిత మధు పాల్గొన్నారు.
నిరుపేదలం అయిన మమ్ములను దళి తబంధు పథకానికి ఎంపిక చేసినందు కు చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం కింద వచ్చిన డబ్బులతో హార్వెస్టర్ కొన్న. ఇప్పటివ రకు కూలీలుగా ఉన్న మమ్ములను సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయ తో యజమానులం అయినం. నిజంగా మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి. వారికి మేము రుణపడి ఉంటం. మంచిగ పని చేసుకొని బతుకుతం.
– సంగి భాస్కర్,గడ్డం నర్సయ్య బంజర
నేను ఇదివరకు కారు డ్రైవర్‌గా పనిచేసేది. దళితబంధు పథకంలో నిరుపేదను అయిన నన్ను లబ్ధిదారుడిగా ఎంపిక చేసిన్రు. ఇప్పుడు నేనే ఓనర్‌ను. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి సార్లకు రుణపడి ఉంటా. ఇప్పుడు దళితబంధు పథకంతో స్విఫ్ట్ కారు కొన్న.. నేనే కారు యజమానిని అయ్యాను. ఇక రంది లేకుంట బతుకుత. కుటుంబాన్ని బాగా చూసుకుంట.
– గడ్డం ప్రవీణ్, బంజర, దేవరుప్పుల
దళిత బంధు పథకంలో నాకు పది లక్షల సెంట్రిం గ్ వచ్చింది. నేను ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో సెంట్రింగ్ మేస్త్రిగా పనులు చేస్తున్నా. నాకు వచ్చిన దళిత బంధు పథకంతో నేను సొంతంగా సెంట్రింగ్ పెట్టుకుంటా. మా ఊళ్లోనే ఉంటా సెంట్రింగ్పని చేసుకుంటా. ఇన్ని రోజులు సెంట్రింగ్ డబ్బా లేక ఇతరుల వద్దకూలీగా పని చేసేది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంతో నేనే నా దగ్గర నలుగురికి ఉపాధి కల్పిస్తా. నాకు సెంట్రింగ్ ఇప్పించిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటా.
– చిదిరాల యాదయ్య, సెంట్రింగ్ మేస్త్రి పాలకుర్తి