కాశీబుగ్గ, ఏప్రిల్ 18 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాపపల్లి జిల్లాలోని నాగారం గ్రామానికి చెందిన రైతు అవదూత శ్రీను 42 బస్తాల పత్తిని తీసుకురాగా, అనిత అడ్తి ద్వారా సిరివల్లి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్‌కు రూ.12,130తో కొనుగోలు చేశాడు. మార్కెట్‌కు ఈ సీజన్లో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 5లక్షల 81వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. అలాగే, మధ్య రకం పత్తికి రూ.11వేలు, కనిష్ఠంగా రూ.9వేల ధర పలికింది.