వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 25: వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ ఎంజీఎం దవాఖాన ఆవరణలోని నర్సింగ్ కళాశాల నుంచి నర్సింగ్ విద్యార్థినులు, కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎంజీఎం సెంటర్ మీదుగా ఐఎంఏ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌వో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా కీటక జనిత వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటా సర్వే ద్వారా బాధితులను గుర్తించి రక్త నమోనాలు సేకరించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు.
కేసులు ఎక్కువగా గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశామని జిల్లా వైద్యాధికారి అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గడిచిన రెండేళ్ల కాలంలో మలేరియా బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రతి కుటుంబం వారివారి పరిధుల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. మురుగు నీటి గుంతల్లో ప్రతి వారం కిరోసిన్ లేదా ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా లార్వా దశలో ఉన్న క్రిమికీటకాలను నివారించొచ్చన్నారు.
కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ శీలా ఎలిజబెత్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది, జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/గీసుగొండ: మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా భాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. అలాగే, గీసుగొండ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై వైద్యాధికారి శ్రీధర్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీధర్ మాట్లాతూ పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, సూపర్వైజర్ కిరణ్‌కుమార్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.