ప్రాణహిత పుష్కరాలకు వేళయ్యింది. ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు త్రివేణి సంగమం కాళేశ్వరం సిద్ధమైంది. రేపటి నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల నుంచి సుమారు 20లక్షల మంది భక్తులు తరలిరానుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగే ఈ పుష్కరాల కోసం జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా రూ.49 లక్షలు మంజూరుచేయగా సకల సౌకర్యాలు సిద్ధంచేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుండగా, బందోబస్తు కోసం పోలీసు శాఖ ప్రతిరోజు 3వేల మందిని కేటాయించింది. మొత్తానికి పన్నెండు రోజుల పాటు భక్తుల నదీ స్నానాలు, సందడితో కాళేశ్వర క్షేత్రం కళకళలాడనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంతో పాటు అసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట వద్ద పారుతున్న ప్రాణహిత నదికి మరో మూడు రోజుల్లో పుష్కర సవ్వడి మొదలుకానుంది. కాగా, దక్షిణ కాశీ శైవక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గల త్రివేణి సంగమంలో ప్రాణహిత నది ఒకటి. రాష్ట్రంలో పుష్కరాలు అంటే గుర్తుకొచ్చేది ముందుగా కాళేశ్వరమే. ఈ నెల 13నుంచి 12 రో జుల పాటు జరగనున్న ప్రాణహిత నది పుష్కరాలతో అప్పుడే కాళేశ్వరం కొత్త శోభ సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొదటి ప్రాణహిత పుష్కరమిది. ఎక్కడా తగ్గకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి సుమారు 20లక్షలమంది భక్తులు కాళేశ్వరం వస్తారని అధికార యంత్రాం గం అంచనా వేసింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తుండగా, బుధవారం నుంచి త్రివేణి సంగమం కళకళలాడనుంది.
పుష్కరాలకు లక్షలాది జనం కాళేశ్వరం రానున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చే అవకాశముంది. ఇక్కడ త్రివేణి సంగమంలో, అతవలి ఒడ్డున ఉన్న ప్రాణహిత నదికి అంతర్రాష్ట్ర వంతెనపై వెళ్లి పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట మీద నుంచి వచ్చే భక్తులు గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మించిన వంతెనల మీదుగా చేరుకొని ప్రాణహితలో పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర వంతెన మీదుగా అటువైపు చేరుకొని భక్తులు పుష్కర స్నానాలు ఆచరించవచ్చు. మంచిర్యాల జిల్లా ప్రజలు చెన్నూరు మీదుగా అతి తక్కువ దూరంలోనే గోదావరిపై గల వంతెన మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల ప్రజలు ఆర్టీసీ బస్సులో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో కాటారం చేరుకొని అక్కడినుంచి మహదేవపూర్ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా ప్రజలు గోదావరిఖని నుంచి చెన్నూరు మీదుగా కాళేశ్వరం అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు.
మహారాష్ట్ర వైపు ఉన్న ప్రాణహిత నదిలో జరిగే పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గత నెల రోజుల నుంచి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలను సమన్వయం చేశారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో జరిగే ప్రాణహిత నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడు ఏర్పాట్ల కోసం రూ.49 లక్షలు మంజూరు చేశారు. వీటిలో రూ.35లక్షలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు, రూ.14లక్షలు ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. అలాగే కాళేశ్వరం దేవస్థానం తరపున మరో రూ.20 లక్షల మంజూరుకు కృషిచేశారు. వీటితో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తదనుగుణంగా అదనంగా నిధులను సమకూర్చుకోవడానికి కూడా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచారు. పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకొస్తూ పనులను శరవేగంగా చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి కాళేశ్వరానికి ఈ సర్వీసులు ఉంటాయి.
పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. 12రోజుల పాటు రోజూ 3వేల మందితో సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.