వరంగల్ చౌరస్తా, మే 11 : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ సతీశ్ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశారు. ఈమేరకు తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదాతల అసోసియేషన్ ప్రతినిధులు వారిని అభినందించి జీవన్‌దాన్ ధ్రువీకరణ పత్రాన్ని సోమవారం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన కానిస్టేబుల్ సెల్వం సతీశ్(36)ను హైదరాబాద్‌కు తరలించారు.
చికిత్స పొందుతున్న సతీశ్ సోమవారం బ్రెయిన్ డెడ్ అవడంతో జీవన్‌దాన్ చైర్మన్ డాక్టర్ స్వర్ణలత కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి అవయవ దానానికి ఒప్పించారు. సతీశ్ శరీరం నుండి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, మూత్రపిండాలను దానం చేశారు. అవయవాలు పాడైపోయి ఇబ్బందులు పడుతున్న ఆరుగురికి శస్త్రచికిత్స ద్వారా వైద్యులు వాటిని అమర్చారు.
బుధవారం రంగశాయిపేట గణపతికాలనీలోని సతీశ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సతీశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సతీశ్ భార్య జ్యోతి, తల్లిదండ్రులు సెల్వ, మణిమేఘాలయికి జీవన్‌దాన్ ధ్రువీకరణపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొండ్రెడ్డి మల్లారెడ్డి, అడ్వైజర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్రావు యాదవ్, కేదారి తదితరులు పాల్గొన్నారు.