నల్లబెల్లి, మే 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అమృత్ సరోవర్ కార్యక్రమంతో నీటి కుంటలకు మహర్దశ రానుందని జడ్పీ సీఈవో అర్శనపెల్లి రాజారావు అన్నారు. మండలంలోని బుచ్చిరెడ్డిపల్లెలో చేపట్టిన పల్లెప్రగతి పనులతోపాటు మంకీఫుడ్ కోర్టు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పురోభివృద్ధి సాధించినట్లు తెలిపారు.
గ్రామంలో యాదాద్రి తరహాలో చేపట్టిన మంకీఫుడ్ కోర్టు బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి గుంతను జడ్పీ నిధులతో మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే, డంపింగ్‌యార్డుల్లో తడి, పొడి చెత్తతో తయారు చేసిన వర్మీకంపోస్టు ద్వారా జీపీలకు అదనపు ఆదాయం సమకూర్చుకుంటూనే ఆ ఎరువును హరితహారం మొక్కలకు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో జామాయిల్ మొక్కలను నాటాలన్నారు.
జూన్ నెలలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నందున నర్సరీల్లో మొక్కలకు తగినంత నీటిని అందించి షిఫ్టింగ్, గ్రేడింగ్ పనులు చేయాలన్నారు. ప్రధానంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులు బాగున్నాయని అధికారులు, జీపి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్ లూనావత్ వెంకన్ననాయక్, కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: నర్సరీలో మొక్కల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ అన్నారు. దాసరిపల్లి, కమ్మపల్లి, నాగుర్లపల్లి, పర్శనాయక్‌తండా, మాదన్నపేటలోని నర్సరీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శులు, వనసేవకులకు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున మొక్కలు ఎండిపోకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఏపీవో ఫాతిమామేరీ, సర్పంచ్‌లు పెండ్యాల శ్రీనివాస్, వల్గుబెల్లి రంగారెడ్డి, గాంధీ, రజిత, చంద్రమౌళి, టీఏలు ఉన్నారు.