ఉరుకుల, పరుగుల జీవనంలో కాసేపు సేద తీరాలనుకునే నగర ప్రజలకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఆనందం, ఆహ్లాదం పంచుతోంది. పచ్చని చెట్ల నీడన ప్రశాంత వాతావరణంలో చిన్నారుల ఆటపాటలు, యువత, కుటుంబసమేతంగా వచ్చే జనంతో కళకళలాడుతోంది. ఎంతో చరిత్ర కలిగిన నిజాం కాలం నాటి పార్కులో రాష్ట్ర ప్రభుత్వం రూ.11కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. గోడలకు తీరొక్క రంగులు మొదలు.. పిల్లల్ని ఆకట్టుకునే వెరైటీ ఆటబొమ్మలు.. అతి పెద్ద చెస్‌బోర్డు, బండరాళ్లపై గ్రిల్స్ వంటివి అమర్చడంతో పార్కుకు కొత్తకళ వచ్చింది.
– హనుమకొండ చౌరస్తా, మే 11
పట్టణ త్రయంగా పిలిచే వరంగల్ నగరంలో ఒకప్పుడు వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, స్వచ్ఛంద సంస్థల ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఈ పబ్లిక్ గార్డెన్ ఇప్పుడు అందరికీ కేంద్ర బిందువుగా మారింది. మంచి ఆహ్లాదకర వాతావరణంతో పాటు యువకులకు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి అన్ని రకాలుగా పరికరాలు ఏర్పాటుచేశారు. అందరినీ ఆకట్టుకునేలా వివిధ రకాల విగ్రహాలతో పాటు శివాలయాన్ని ఆధునీకరించారు. వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు.
గార్డెన్‌కు నలువైపులా రోడ్ల విస్తరణతో పాటు, నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకు, సులభ్ కాంప్లెక్స్ లాంటి నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో పబ్లిక్గార్డెన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో ఆస్వాదించేందుకు ప్రజలు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.
యువతతో పాటు సాధారణ ప్రజానీకానికి వ్యాయామంపై అవగాహన పెంచడం, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఇకపై ఖర్చు చేయకుండా జీడబ్ల్యూఎంసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఓపెన్ జిమ్‌ల్లో ఒక్కోచోట రూ.30 లక్షల వరకు వెచ్చించి ఖరీదైన పరికరాలను అమర్చారు. అబ్డామినల్ రైడర్, వర్టికల్ షోల్డర్ఫుల్, లెగ్ఎక్స్టెన్షన్, కర్ల్ మిషన్లు, షోల్డర్ ట్విస్టర్లు, పుల్ఛైర్స్, చెస్ట్పుష్ మిషన్లు అమర్చారు. యువకులతో పాటు నడి వయస్కులు, మహిళలు కూడా ఓపెన్ జిమ్‌కు రావడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్గార్డెన్ను అన్నివిధాలా అభివృద్ధి చేసింది. రూ.11కోట్లతో ఆధునికరించారు. వాకర్స్ కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం నూతన పరికరాలు, ఓపెన్‌జిమ్, ఆకట్టుకునే విగ్రహాలను, నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం, శివాలయం, బాలల గ్రంథాలయం, ప్రత్యేకంగా ఆకట్టుకునే టౌన్‌హాల్ ఇలా ఒకరోజు మొత్తం సరదాగా గడిపేందుకు అన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
– వల్లాల జగన్, పబ్లిక్‌గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పార్క్‌లో బొమ్మలు చాలా బాగున్నాయ్. మాది హనుమకొండ అశోకాకాలనీ. ప్రతిరోజు సాయంత్రం ఫ్రెండ్స్‌తో వచ్చి ఆడుకుంటాం. మేం ఆడుకునేందుకు లేటెస్ట్ వస్తువులున్నాయి. సమ్మర్ హాలీడేస్ కదా.. చాలామంది వస్తున్నారు. ఇక సండే వస్తే పండుగలా ఉంటుంది.
– అక్షిత, ఇక్షిత, విద్యార్థులు,