కరీమాబాద్, ఏప్రిల్ 29 : హిజ్రాల సమస్యలను పరిష్కరిస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం ఉర్సు బైపాస్ రోడ్డులో హిజ్రా సంఘం నాయకురాలు లైలా ఆధ్వర్యంలో తెలంగాణ హిజ్రాల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్రాలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వ పరంగా చేయూత అందిస్తానన్నారు. నియోజకవర్గంలోని హిజ్రాలకు గతంలోనే ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఆ స్థలంలో సొంత ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలను ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానన్నారు. హిజ్రాలకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను హిజ్రాలు సత్కరించారు. కార్యక్రమంలో కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, నాయకులు నాగపురి సంజయ్బాబు, మండ శ్యాం, వొగిలిశెట్టి అనిల్, పొగాకు సందీప్, బత్తిని రంజిత్ తదితరులు పాల్గొన్నారు.