వరంగల్, 18: ఈనెల 20వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఆరు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, 12 శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణప్రగతి, సీఎంఏ, సాధారణ నిధులు, స్మార్ట్‌సిటీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో ఇప్పటికే పూర్తయిన రూ.27.63కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ.150.20కోట్ల అంచనాలతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఒకేచోట శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను గ్రేటర్ అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అదేస్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
స్మార్ట్‌సిటీగా చెందుతున్న తరుణంలో రూ.71కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు గ్రేటర్ కార్పొరేషన్ పరిపాలన భవనంతోపాటు నూతన కౌన్సిల్ హాల్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో 150 అడుగుల జాతీయ పతాకం ఏర్పాటుకు పునాదిరాయి వేయనున్నారు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్న 12 అభివృద్ధి పనులకు శిలాఫలకాలను కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతోపాటు కార్పొరేషన్ కార్యాలయం ముందు స్మార్ట్ 4ను ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. కమిషనర్ ప్రావీణ్య అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ములుగు రోడ్డు వద్ద స్మార్ట్‌రోడ్డు 3తోపాటు రీజినల్ లైబ్రరీ, పబ్లిక్‌గార్డెన్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
1. రూ.7కోట్లు (స్మార్ట్ రోడ్డు 3) అలంకార్బ్రిడ్జి నుంచి కాపువాడ రోడ్డు వరకు
2. రూ.7కోట్లు (స్మార్ట్ రోడ్డు 4) భద్రకాళీ కమాన్ నుంచి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు
3. రూ.11.50కోట్లతో పబ్లిక్ గార్డెన్ నవీకరణ
4. రూ.1.50కోట్లు ప్రాంతీయ గ్రంథాలయం నవీకరణ
5. రూ.26లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠరథాలు
6. రూ.36లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మిషన్లు
1. రూ.8కోట్లతో 150 కేఎల్డీ సామర్థ్యం గల మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ కేంద్రం
2. రూ.22.50కోట్లతో కార్పొరేషన్ పరిపాలన భవనం
3. రూ.2కోట్లతో కౌన్సిల్ హాల్
4. రూ.2కోట్లతో దివ్యాంగుల శిక్షణ కేంద్రం
5. రూ.9కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
6. రూ.1.50కోట్లతో పోతన వైకుంఠధామం నిర్మాణం
7. రూ.22కోట్లతో నయీంనగర్ నుంచి ప్రెసిడెన్షియల్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్ ఏర్పాటు
8. రూ.15కోట్లతో నాలాలపై కల్వర్టులు
9. రూ.71కోట్లతో బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
10. రూ.2.50కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్
11. రూ.70లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో 150 అడుగుల జాతీయ జెండా
12. రూ.4కోట్లతో గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్