కొడంగల్, ఏప్రిల్ 8: బోదకాలు వ్యాధిగ్రస్తులు పరిశుభ్రతను పాటించాలని జిల్లా మలేరియా అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం స్థాని క వ్యవసాయశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బోదకాలు వ్యాధిగ్రస్తులు ఇంటివద్ద తీసుకోవాల్సిన పద్ధతులపై వారికి అవగాహన కల్పించడంతోపాటు మందుల కిట్లను అందజేశారు. అదేవిధంగా వ్యా ధి సోకిన ప్రదేశంలో ఏవిధంగా శుభ్రత పాటించాలో, వ్యాయామం ఏ విధంగా చేయాలో వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలో 101 మంది బోదకాల వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపారు. మూడోదశలో ఉన్న వ్యాధిగ్రస్తులకు వ్యాధిపై, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతోపాటు మందుల కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పుండు ఉన్న ప్రదేశంలో చల్లటి నీటితో సబ్బుతో కడిగి, పలుచటి గుడ్డతో తుడువాలన్నారు. అదేవిధంగా వ్యాధి సోకిన శరీర భాగానికి సరిగ్గా రక్త ప్రసరణ జరిగేలా ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా మలేరియా సహాయ అధికారి గంగప్ప, డాక్టర్ రమేశ్‌బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.